Atulya Chandra : వైద్యుడిపై నటి దాడి కేసులో కళ్లు చెదిరే ట్విస్ట్: బాధితుడు కాదు పచ్చి కామాంధుడు.. ఫోన్‌లో 12 మంది మహిళల రేప్ వీడియోలు!

Atulya Chandra News

Atulya Chandra News

కేరళలోని కొచ్చిలో ఓ యువ వైద్యుడిపై నటి అతుల్య చంద్ర, ఆమె గ్యాంగ్ చేసిన దాడి కేసులో ఎవరూ ఊహించని మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కొద్దిసేపటి క్రితం వరకు దాడికి గురైన బాధితుడిగా సానుభూతి పొందిన ఆ డాక్టర్.. వాస్తవానికి ఓ పచ్చి కామాంధుడని పోలీసుల విచారణలో తేలింది! నటి గ్యాంగ్ దాడి చేసిన తర్వాత డాక్టర్ ఫోన్‌ను పోలీసులకు అప్పగించగా, అందులో ఏకంగా 12 మంది మహిళల అత్యంత వ్యక్తిగత, అసభ్యకరమైన వీడియోలు బయటపడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన షాకింగ్ వివరాల ప్రకారం.. డాక్టర్ జాన్సన్ కె. వర్గీస్ అనే ఈ కీచక వైద్యుడు, తన వద్దకు వచ్చే మహిళా రోగులను, వారి బంధువులను టార్గెట్ చేసేవాడు. వారికి మత్తు మందు ఇచ్చి, వారిపై అత్యాచారానికి పాల్పడుతూ ఆ దారుణాన్ని తన మొబైల్‌లో వీడియోలు తీసుకునేవాడు. నటి అతుల్య బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు.. అతడి ఫోన్‌లో ఇలాంటి సుమారు 12 మంది మహిళల ప్రైవేట్ వీడియోల పెద్ద కలెక్షన్ దొరికింది. లైంగిక దాడికి పాల్పడిన ప్రతిసారీ ఈ సైకో డాక్టర్ వాటిని రికార్డ్ చేసి భద్రపరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై రేప్ కేసు నమోదు చేయగా, ప్రస్తుతం ఆ కీచక డాక్టర్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే పనిలో ఉన్నారు.

ఇక ఈ కీచకుడి బండారం బయటపెట్టడానికి దారితీసిన ‘దాడి’ కేసులో.. ప్రధాన నిందితులుగా ఉన్న నటి అతుల్య చంద్ర, నటుడు బిపిన్ పెరుంపల్లి, వారి డ్రైవర్ విష్ణులకు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వీరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ఎర్నాకుళం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. డాక్టర్‌ది తప్పుడు ఫిర్యాదు అని నిందితులు వాదించినప్పటికీ.. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున, వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాలన్న పోలీసుల అభ్యర్థనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కడవంత్ర పోలీసులు నటి అతుల్య గ్యాంగ్‌ను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. డాక్టర్‌పై దాడి కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా, ఇంకా 9 మంది పరారీలోనే ఉన్నారు. ఒకవైపు డాక్టర్ జాన్సన్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, అతని ఇంట్లో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. బయటపడిన వీడియోల్లోని బాధిత మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే డాక్టర్‌పై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఒక సెలబ్రిటీ దాడి కేసు కాస్తా.. చివరికి ఓ సైకో డాక్టర్ చీకటి బాగోతాన్ని బట్టబయలు చేయడం ఇప్పుడు కేరళలో తీవ్ర కలకలం రేపుతోంది.