Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన జీవిత ప్రయాణం, చిన్ననాటి జ్ఞాపకాలు, సినీ కెరీర్ కోసం ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నతనంలో తాను హాస్టల్‌లో ఉన్న సమయంలో తన తల్లి కువైట్‌లో ఉద్యోగం చేసేవారని తెలిపారు. ఆ సమయంలో తల్లి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో పూర్తిగా అర్థం కాలేదని, కానీ ఇప్పుడు తాను తండ్రి అయిన తర్వాత ఆమె బాధ, త్యాగం విలువ తెలిసిందని చెప్పారు. “పిల్లలకు దూరంగా ఉండటం ఎంత కష్టమో ఇప్పుడు నాకు అర్థమవుతోంది” అని కిరణ్ అన్నారు.
తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్న ఆయన.. చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని చెప్పారు. కాలేజీలో అందరికంటే అల్లరి చేసేవాడిని, వరస్ట్ ఫెలో ఎవరు అంటే తన పేరే చెప్పుకునే స్థాయిలో ఉండేవాడినని నవ్వుతూ చెప్పారు. అయితే హాస్టల్ జీవితం తనకు ఎన్నో విషయాలు నేర్పిందని, వివిధ ప్రాంతాల వ్యక్తులతో కలవడం వల్ల తన ఆలోచనా విధానం మారిందని వెల్లడించారు. ఉద్యోగం చేసిన రోజులను గుర్తుచేసుకుంటూ.. తన మొదటి జీతాన్ని ఇంటికి ఇచ్చానని చెప్పారు. తర్వాత వచ్చిన జీతంతో బెంగళూరులో షాపింగ్ చేయడం తనకు ప్రత్యేకమైన అనుభవమని తెలిపారు. సినిమాల్లోకి రావడానికి ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ఉద్యోగం వదిలేసిన తర్వాత అవకాశాల కోసం రోజుకు 13 నుంచి 14 కిలోమీటర్లు నడిచిన రోజులు ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రస్తుత తరం ప్రేమ, రిలేషన్‌షిప్స్‌పై కూడా స్పందిస్తూ.. ప్రేమలోని అసలైన ఎమోషన్, విలువను అర్థం చేసుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

