సాధారణంగా సినిమాల్లో క్లైమాక్స్ అంటే హీరో ఎంట్రీ ఇచ్చి రౌడీలను ఇరగదీయడం చూస్తుంటాం. కానీ ఒకవేళ హీరోయిన్ ఏకంగా కుంగ్ ఫూ రేంజ్లో బ్రూస్ లీలా మారి విలన్ల భరతం పడితే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ ‘డొరొతీ’ (సుబ్బు) ఒరిజినల్ స్క్రిప్ట్ క్లైమాక్స్‌లో ఉందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ స్క్రిప్ట్‌లో ఉన్న ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్విస్ట్ ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. అయితే ఇక్కడ హీరోయిన్ అని కూడా అనలేం. ఇద్దరు హీరోలలో ఒకరు ట్రాన్స్ జెండర్ గా మారుతారన్న సంగతి తెలిసిందే. ఇక కార్తీక్ సుబ్బరాజు లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం కార్తీ, డొరొతీ (సుబ్బు) ఇప్పుడు క్లైమాక్స్ లో చూపిన తమ రొమాంటిక్ కిస్ తర్వాత మధురైకి తిరిగి వస్తారు. సన్నిహితుల సమక్షంలో వీళ్ల పెళ్లికి అంతా గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతుంటాయి. అంతా సంతోషంగా ఉన్న ఆ సమయంలో, ఆ జంటను ఎలాగైనా మట్టుబెట్టాలని ‘విజిల్ వీరయ్య’ తన గ్యాంగ్‌తో అక్కడికి చేరుకుంటాడు. కత్తులతో ఎటాక్ చేయడానికి వచ్చిన వీరయ్యకు అక్కడ ఒక ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెళ్లి వస్త్రాల్లో ఉన్న డొరొతీని చూడగానే అతనికి చనిపోయిన తన కన్నతల్లి గుర్తొస్తుంది.
ఆమె రూపంలో తన తల్లిని చూసుకుని మనసు కరిగిపోయిన వీరయ్య.. వెంటనే ఆ దాడులను ఆపి, ఆ జంటను వదిలేయాలంటూ తన కొడుకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ, పంతం మీద ఉన్న ఆ సోదరులు మాత్రం వెనక్కి తగ్గరు. “ఆమెను ఒక అమ్మాయిగా మనం అంగీకరించినా.. కార్తీ వేరే కులానికి చెందినవాడు కదా! కులాంతర వివాహం చేసుకుంటున్న అతనికి మన అమ్మాయిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం?” అంటూ వీరయ్యతో తీవ్ర వాగ్వాదానికి దిగుతారు. కుల పిచ్చితో రగిలిపోతూ కార్తీని చంపేందుకు విలన్లు ముందుకు దూకుతారు. సరిగ్గా అప్పుడే స్క్రిప్ట్‌లో ఊహించని బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. తన ప్రేమికుడిని చంపడానికి వస్తున్న వారి ముందు డొరొతీ భయంతో ఏడుస్తూ కూర్చోదు.. ఏకంగా బ్రూస్ లీ తరహాలో మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌తో విలన్ల మీదకు సివంగిలా దూకుతుంది. ఎవరూ ఊహించని ఈ యాక్షన్ ఎపిసోడ్లో సుబ్బు చేసిన ఫైట్ స్క్రిప్ట్‌కే హైలైట్‌గా నిలిచింది. ఒక ఎమోషనల్ పాయింట్, పరువు హత్యల నేపథ్యం, దానికి తోడు బ్రూస్ లీ తరహా మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్.. ఈ ఒరిజినల్ క్లైమాక్స్ గనుక తెరమీద పడి ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు!

