Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్

Karanjohar

Karanjohar

ఒకప్పుడు దర్శకుడిగా హిట్స్ మీద హిట్లు అందుకున్న బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, 2023 నుంచి స్టార్ కిడ్స్‌ను స్టార్స్‌గా మార్చే పనిలో పడి కోట్లాది రూపాయలు నష్టపోవడమే కాదు, తన తండ్రి ఎంతో కష్టపడి నిర్మించిన ‘ధర్మా ప్రొడక్షన్స్’ అనే సినిమా నిర్మాణ సంస్థలో దాదాపు 50 శాతం వాటాను సైతం అమ్ముకునే స్థితికి చేరుకున్నాడు. అంతేకాదు, రీసెంట్ టైమ్స్‌లో కరణ్, రణబీర్ కపూర్‌ను హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేసిన ఒక్క ‘బ్రహ్మాస్త్ర’ మూవీ తప్ప మరే మూవీ ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు కూడా తీసుకురాలేదు.

దీంతో ఈసారి తన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ డూపర్ హిట్ కావాలని, సూపర్ ఫామ్‌లో ఉన్న మలయాళ దర్శకుడు రాహుల్ సదాశివన్ తో చేతులు కలిపాడు. ఈ మేరకు ‘భూతకాలం’, ‘భ్రమయుగం’, ‘డైస్ ఐరా’ వంటి బ్యాక్ టు బ్యాక్ హారర్ చిత్రాలు డైరెక్ట్ చేసిన రాహుల్ సదాశివన్ నెక్స్ట్ మూవీలో తాను కూడా భాగం కానున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

×
×
Ad

‘పృథ్వీరాజ్ సుకుమారన్’, ‘మంజు వారియర్’ హీరో హీరోయిన్లుగా రాబోతున్న ఈ హారర్ బ్యాక్‌డ్రాప్ మూవీని స్వయంగా పృథ్వీరాజ్ నే తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తుండగా, తాజాగా మూవీ టైటిల్ పోస్టర్‌ను కరణ్, పృథ్వీ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నిజానికి మలయాళ భాషలో ‘ఒడియన్’ అంటే తాంత్రిక శక్తులతో జంతువు రూపంలోకి మారగలిగే వ్యక్తి అని అర్థం. కేరళలోని వల్లువనాడ్ ప్రాంతంలో ఓ ప్రాచీన తెగకు చెందిన ఈ ఒడియన్లు, రాత్రుల్లో ఇతరులను భయపెట్టేందుకు ఈ తాంత్రిక విద్యను అభ్యసించేవారు అని వినికిడి.

దీంతో ‘భూతకాలం’ లాంటి ఓ విభిన్న హారర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాహుల్ సదాశివన్, ఇప్పుడు ఈ చేతబడుల అంశాలు ఉన్న కాన్సెప్ట్‌తో మూవీని ఇంకెంత భయంకరంగా తీస్తారో అనే హైప్ సోషల్ మీడియాలో జనరేట్ అయ్యింది. అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాస్‌తో ప్రసిద్ధి చెందిన కరణ్ జోహార్ బ్యానర్‌కు ఈ మలయాళ హారర్ మూవీ పాన్ ఇండియా హిట్ ఇస్తుందో లేదో అనే డిస్కషన్ కూడా బి-టౌన్‌లో జోరుగా సాగుతోంది.