బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏమి చేసినా అది చర్చనీయాంశమే అవుతుంది. ‘రిజైన్ మోదీజీ’ అనే హ్యాష్ ట్యాగ్ తో కొందరు నెటిజన్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడంతో కంగనాకు చిర్రెత్తుకొచ్చింది. ‘మోదీకి పాలించడం రాదు, సచిన్ కు బ్యాటింగ్ చేయడం రాదు, కంగనాకు నటించడం రాదు, లతాజీకి పాడటం రాదు’ అన్నట్టుగా కొందరు మోదీపై విషం కక్కుతున్నారంటూ కంగనా నిన్న ట్విట్టర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనను మోదీతో, సచిన్ తో, లతా మంగేష్కర్ తో పోల్చుకున్న కంగనా… ఇవాళ షారుఖ్ ఖాన్ తో తనను పోల్చుకుంటూ ట్వీట్ చేసింది. అయితే అందుకు కారణం లేకపోలేదు! ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘గ్యాంగ్ స్టర్’ విడుదలై బుధవారానికి పదిహేనేళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ, ‘పదిహేనేళ్ళ క్రితం ‘గ్యాంగ్ స్టర్’ ఇదే రోజున విడుదలైంది. షారుఖ్ ఖాన్ జీ, నాది ఓ విజయగాథ. అయితే ఎస్సార్కే ఢిల్లీ నుండి వచ్చారు. కాన్వెంట్ లో చదువుకున్నారు, తల్లిదండ్రులకు చిత్రసీమతో సంబంధం ఉంది. కానీ నాకు ఇంగ్లీష్ లో ఒక్క పదం తెలియదు, చదువు లేదు, హిమాచల్ ప్రదేశ్ లోని ఓ మారుమూల పల్లె నుండి వచ్చాను. నా జీవితాన్ని దయనీయంగా మార్చిన నా సొంత తండ్రి, తాతయ్యతోనే మొదట పోరాటం చేయాల్సి వచ్చింది. గడిచిన పదిహేను సంవత్సరాలలో ఎన్నో విజయాలను సాధించినా ఇంకా అస్థిత్వం కోసం పోరాటం చేయక తప్పడం లేదు. అయితే… ఇది ఎంతో విలువైనది. దీనిని నాకు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ మనసులో మాట తెలిపింది కంగనా రనౌత్.
ఈ పదిహేనేళ్ళ సినీ ప్రయాణంలో కంగనా రనౌత్ నాలుగు జాతీయ పురస్కారాలను అందుకుంది. ‘ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక / పంగా’ చిత్రాలకు గానూ ఈ అవార్డులు లభించాయి. కంగనా నటించిన తాజా చిత్రం జయలలిత బయోపిక్ ‘తలైవి’ విడుదలకు సిద్ధంగా ఉంది.