NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?

Ntr Balaramayanam

Ntr Balaramayanam

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా, దివంగత నందమూరి హరికృష్ణ కుమారుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, తన 25 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 30 సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. తాజాగా సెన్సేషన్ సృష్టిస్తున్న ‘డ్రాగన్’ మూవీ జూనియర్ ఎన్టీఆర్‌కు 31వ చిత్రం. అయితే, ఈ మూవీస్ అన్నిటికన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ తన జూనియర్ ఏజ్‌లోనే చైల్డ్ ఆర్టిస్టుగా మూడు విభిన్న పాత్రలు పోషించాడు.

అందరికీ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’ చిత్రంలోని బాల రాముడి పాత్ర మాత్రమే బాగా తెలుసు. కానీ, ఈ తారక రాముడు ఆ బాల రాముడి పాత్ర వేయకముందు రెండు ప్రత్యేక పౌరాణిక పాత్రలు సైతం వేశాడు. నందమూరి తారక రామారావు హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాన్ని హిందీ వెర్షన్‌లో కూడా తెరకెక్కించగా, అందులో జూ. ఎన్టీఆర్ ఎనిమిదేళ్ల వయసులోనే భరతుడిగా నటించి తాతతో స్క్రీన్ షేర్ చేసుకునే చక్కటి అదృష్టాన్ని పొందాడు.

అంతేకాదు, బాల రామాయణం చిత్రంలో బాల రాముడిగా నటించక ముందు 13 ఏళ్ల వయసులో ఈటీవీలో వచ్చిన ‘భక్త మార్కండేయ’ అనే సీరియల్‌లో భక్త మార్కండేయుడిగా కూడా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇలా జూ. ఎన్టీఆర్ హీరో కాకముందే కొన్ని విలక్షణమైన పౌరాణిక పాత్రలు పోషించి, వంశానికి తగ్గ వారసుడిగా వారెవా అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడైతే ‘డ్రాగన్’, ‘దేవర 2’ వంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్‌లో నటిస్తూ.. తన అద్భుతమైన డ్యాన్స్ అండ్ డైలాగ్ డెలివరీతో అటు తెలుగు అభిమానులతో పాటు, ఇటు జపాన్ అభిమానులను సైతం గెలుచుకుని, తన అభిమానాన్ని ఖండాంతరాలు దాటేలా చేస్తున్నాడు.