వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌గా దూసుకుపోతోంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చు అనే నమ్మకాన్ని నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ క్రియేట్ చేశారు. తాజాగా వీరి కాంబోలో మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్‌లో నిర్మాత నవీన్ ఎర్నేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.’ఇరుముడి’ సక్సెస్ మీట్ లో నవీన్ మాట్లాడుతూ సినిమా చూసిన ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు. “ఒకటిన్నర నెల క్రితం నేను ఈ సినిమా చూశాను. సినిమా చూస్తున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. ఎడిట్ రూమ్ లో సుమారు 10 నిమిషాల పాటు అలా ఏడుస్తూనే ఉండిపోయాను. వెంటనే రవితేజ గారికి కాల్ చేసి.. ‘ఇది మీ కెరీర్ లోనే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ పెర్ఫార్మెన్స్’ అని చెప్పాను. ఆ తర్వాత కింద ఉన్న డైరెక్టర్ శివ దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా హత్తుకున్నాను. ఆ ఎమోషన్ నుంచి బయటకు రాలేక, వాష్ రూమ్ కి వెళ్లి మొహం కడుక్కుని వచ్చాను. సినిమా అద్భుతంగా వచ్చింది.. శివ, ఏంటి ఈ సినిమా! అని ఆ రోజే ఆశ్చర్యపోయాను. థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఆ రోజు నేను అనుకున్నది నిజమైందని చాలా సంతోషంగా ఉంది” అని నవీన్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమా బాక్సాఫీస్ సునామీ గురించి చెబుతూ నవీన్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. “కలెక్షన్స్ రిపోర్ట్స్, కంగ్రాచులేషన్స్ మెసేజ్ లతో నిద్ర కూడా పోవడం లేదు. రాత్రి ఒంటిగంటకు పడుకుని, ఉదయం 5 గంటలకే లేస్తున్నాను. మా డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన ఉషా పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ విజయ్ నాకు ఫోన్ చేసి.. ‘మా 50 ఏళ్ల కెరీర్ లో ఒక సినిమా కేవలం 36 గంటల్లోనే (ఒకటిన్నర రోజుల్లో) ప్రాఫిట్ లోకి రావడం అనేది మేము చూడలేదు’ అని ఆనందంగా చెప్పారు. అలాగే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వీరనాయుడు గారైతే.. ఈ సినిమా కలెక్షన్స్ ప్రభంజనం చూస్తుంటే ఒకప్పటి ‘లవకుశ’ రోజులు గుర్తొస్తున్నాయని అన్నారు. ఇంతకంటే బ్లాక్ బస్టర్ రిపోర్ట్ ఏముంటుంది?” అని నవీన్ హర్షం వ్యక్తం చేశారు. దర్శకుడు శివ టేకింగ్, రవితేజ పవర్ ఫుల్ యాక్టింగ్ తో ‘ఇరుముడి’ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందని, రాబోయే రెండు మూడు వారాల పాటు థియేటర్లలో ఈ జాతర ఇలాగే కంటిన్యూ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమాను ఇంతటి ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు, అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లి ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయాలని నవీన్ కోరారు.

