Indian Cinema: ఒకప్పుడు సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు అంటేనే ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేది. కానీ పాన్-ఇండియా సునామీ మొదలయ్యాక లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు రూ. 500 కోట్లు కనీస ప్రామాణికంగా మారిపోగా, రాబోయే ప్రాజెక్టులు రూ. 1000 కోట్ల నుంచి ఏకంగా రూ. 4000 కోట్ల మైలురాళ్లను టార్గెట్ చేస్తున్నాయి. ఆడియన్స్‌కు విజువల్ వండర్స్ అందించాలన్న దర్శకుల ఫాంటసీ, ప్యాషన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన భారంగా మారుతున్నా బడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా రూ. 600 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘కల్కి 2898 AD’ రికార్డులను బద్దలు కొట్టేందుకు సరికొత్త ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఊహకందని విధంగా బాలీవుడ్ ‘రామాయణ’ రెండు భాగాల కోసం నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా ఏకంగా రూ. 4,000 కోట్లు వెచ్చిస్తున్నారనే వార్త సినీ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. మరోవైపు సౌత్ ఇండస్ట్రీలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి బ్రాండ్‌కు ఉన్న గ్లోబల్ క్రేజ్‌తో, మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ మూవీ ‘వారణాసి’పై శ్రీ దుర్గా ఆర్ట్స్ రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందట. ఇప్పటివరకు రూ. 500 కోట్ల మార్కును అందుకోని మహేష్, ఈ సినిమాతో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు.
ఇక ‘పుష్ప 2’తో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మరింత భారీగా ప్లాన్ చేశారు. పాన్-ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్‌ను హోల్డ్‌లో పెట్టి, ‘జవాన్’తో బీ-టౌన్‌కు కలెక్షన్ల వేట నేర్పిన అట్లీతో ‘రాకా’ అనే భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఈ కాంబినేషన్ క్రేజ్ చూసి సన్ పిక్చర్స్ ఏకంగా రూ. 800 నుంచి రూ. 1,000 కోట్ల బడ్జెట్‌ను కుమ్మరించేందుకు ముందుకొచ్చిందని తెలుస్తుంది. సినిమా వ్యయం ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్ల రెమ్యూనరేషన్లు, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ పనులే అని తెలుస్తుంది. వీటికి తోడు విదేశీ లొకేషన్లు, భారీ సెట్స్ అంటూ వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ఓటీటీ సంస్థలను ఆకర్షించేందుకు ఈ భారీ బడ్జెట్లు పనికొస్తున్నప్పటికీ, అంతిమంగా నిర్మాణ వ్యయం పెరిగిపోయిందనే సాకుతో టికెట్ రేట్లను విపరీతంగా పెంచి ఆ భారాన్ని ప్రేక్షకులపైనే మోపుతున్నారు. ఎంటర్టైన్మెంట్ రంగాన్ని పూర్తిగా కమర్షియలైజ్ చేస్తూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఖర్చు చేయడం మంచిదే. సినిమా బ్లాక్‌బస్టర్ అయి పెట్టిన పెట్టుబడికి రెండింతలు వస్తే ఓకే. కానీ ఒక్కసారి అంచనాలు తప్పి రిజల్ట్ తేడా కొడితే మాత్రం నిర్మాణ సంస్థలు రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. ఇప్పటికే భారీ వ్యయంతో వచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన ఆదిపురుష్, కంగువ, గేమ్ ఛేంజర్, రాజాసాబ్, జననాయగన్, టాక్సిక్ వంటి చిత్రాల ఫలితాలు ఇండస్ట్రీకి ఎంతటి కోలుకోలేని దెబ్బ తీశాయో బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితుల్లో వేల కోట్లతో సినిమాలు తీయడం ఎంతవరకు సేఫ్ అన్నది రానున్న ప్రాజెక్టుల రిజల్ట్‌పైనే ఆధారపడి ఉంది.

