ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ వైద్య (98) ముంబైలో అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈయన మనవడు శక్తి అరోరా టీవీ సీరియల్ నటుడు. చంద్రశేఖర్ కుమారుడు ప్రొఫెసర్ అశోక్ చంద్రశేఖర్ తన తండ్రి అంత్యక్రియలను ముంబైలోని విలే పార్లే లో మధ్యాహ్నం పూర్తి చేసినట్టు తెలిపారు. చంద్రశేఖర్ 1923 జూలై 7న హైదరాబాద్ లో జన్మించారు. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, ముంబై చేరారు. వెస్ట్రన్ డాన్స్ లో యూకే నుండి డిప్లోమా పొందారు. అలనాటి ప్రముఖ గాయని షమ్షాద్ బేగమ్ సిఫార్సు తో 1948లో పూణేలోని షాలిమార్ స్టూడియోలో చంద్రశేఖర్ ఉద్యోగం సంపాదించు కున్నారు. కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాలలో ఆయన జూనియర్ ఆర్టిస్ గా నటించారు. 1953లో వి. శాంతారామ్ నిర్మించిన ‘సురంగ్’లో మొదటిసారి హీరోగా నటించారు. అలానే 1954లో వచ్చిన ‘ఔరత్ తేరీ యహీ కహానీ’ చిత్రం నటుడిగా చంద్రశేఖర్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘గేట్ వే ఆఫ్ ఇండియా, ఫ్యాషన్, బర్సాత్ కీ రాత్, బాత్ ఏక్ రాత్ కీ, అంగుళిమాల, రుస్తుం -ఎ- బాగ్దాద్, కింగ్ కాంగ్, జహనారా వంటి చిత్రాలు చంద్రశేఖర్ కు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
మ్యూజికల్ ఫిల్మ్ ‘చా చా చా’ ను ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తానే హీరోగా నటించారు. హెలెన్ ప్రధాన పాత్ర పోషించిన తొలి చిత్రం ఇదే! ఆ తర్వాత 1966లో చంద్రశేఖర్ మరోసారి ‘స్ట్రీట్ సింగర్’ మూవీని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆ తర్వాత శక్తి సామంత్ దర్శకత్వం వహించిన సినిమాలలోనూ, రాజేశ్ ఖన్నా హీరోగా నటించిన సినిమాల్లో అత్యధికంగా నటించారు. గుల్జర్ అంటే అభిమానం ఉన్న చంద్రశేఖర్ ఆయన దగ్గర ‘పరిచయ్, కోషిష్, అచానక్, ఆనంది, ఖుష్బూ, మౌసమ్’ చిత్రాలకు పనిచేశారు. 65 సంవత్సరాల వయసులో చంద్రశేఖర్ రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణ్’ టీవీ సీరియల్ లో దశరథుడి ప్రధాన సలహాదారు పాత్రను పోషించారు. దాదాపు 200 చిత్రాలలో నటించిన చంద్రశేఖర్ చివరగా 2000 సంవత్సరంలో ‘ఖాఫ్’ చిత్రంలో నటించారు. దానికి ముందు ఆయన 1985 నుండి 1996 వరకూ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అలానే వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్, సినీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్ లో వివిధ హోదాలలో పనిచేశారు.