Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!

Gopichand

Gopichand

Gopichand: ఒక్క విజయం దక్కితే అరడజను పరాజయాలు పలకరించడం మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్‌లో ఒక అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సీటీమార్’ తర్వాత సరైన విజయం లేక, గతంలో వచ్చిన ‘భీమా’, ‘విశ్వం’ వంటి చిత్రాలు తీవ్ర నిరాశను మిగల్చడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని గోపీచంద్ గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. అందుకోసమే రొటీన్ కథలను పక్కనపెట్టి, దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని వైవిధ్యమైన స్క్రిప్టులతో రెండు క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. అయితే సినిమాలు శరవేగంగా ముస్తాబవుతున్నా, థియేటర్లలోకి ఎప్పుడు వస్తాయనే విషయంపై మాత్రం మేకర్స్ పెదవి విప్పకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్‌ను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ‘ఘాజీ’ వంటి జాతీయ అవార్డు చిత్రాన్ని తెరకెక్కించిన విలక్షణ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ ‘భరతవర్ష’ అనే భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏడవ శతాబ్దం నాటి చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన టైటిల్ గ్లింప్స్, ఆ తర్వాత మూడు నెలల కిందట విడుదలైన తొలి పాట సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. తాజాగా దసరా సందర్భంగా ‘అమ్మ కదలి వచ్చే’ అంటూ సాగే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటతోనైనా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది.

ఇక గోపీచంద్ కెరీర్‌లో 34వ చిత్రంగా తెరకెక్కుతున్న మరో సినిమా ‘సింగ’. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాలుగు నెలల కిందట రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ చూస్తే ఇదొక ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని స్పష్టమైంది. కానీ ఆ గ్లింప్స్ తర్వాత చిత్ర యూనిట్ నుంచి కనీస బజ్ కూడా లేకుండా పోయింది. ఈ చిత్రం ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది ఆ యూనిట్‌కే తెలియని పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా థియేటర్లలో గోపీచంద్ కటౌట్ కనిపించక ఆయన అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, రిలీజ్ తేదీల విషయంలో ఇలా దాగుడుమూతలు ఆడటం మ్యాచో స్టార్ మార్కెట్‌ను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ ఏడాదైనా గోపీచంద్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తారా లేక ఈ ఎదురుచూపులు మరింత కాలం సాగుతాయా అనేది చూడాలి.