1989లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన గీతాంజలి సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన గిరిజా షెట్టర్ అప్పట్లో అందరి మనసును దోచుకుంది. ఆ అమాయకపు చిరునవ్వు, సింపుల్ లుక్, డైలాగ్స్ అన్నీ ఆమెను ఆ కాలపు హార్ట్‌థ్రోబ్‌గా మార్చాయి. తాజాగా, నటుడు జగపతి బాబు హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమ్ము రా విత్ జగపతి తొలి ఎపిసోడ్లో గిరిజా చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై కనబడారు. ఆ ప్రత్యేక ఎపిసోడ్‌కి గీతాంజలి హీరో నాగార్జున గెస్ట్‌గా హాజరయ్యారు. ఇందులో ఒక వీడియో సందేశం ద్వారా గిరిజా తన జ్ఞాపకాలను పంచుకున్నారు.
Also Read : Suriya 46: సూర్య సినిమాలో బాలీవుడ్ హీరో.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
“గీతాంజలి నా మొదటి సినిమా. నాగ్ చాలా ఎంటర్టైనర్. ఆయన చాలా మంచి మనిషి, ఒక లెజెండ్ కంటే తక్కువేం కాదు. నా తొలి సినిమాకు ఆయన సహనటుడిగా ఉన్నందుకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని” అని గిరిజా చెప్పారు. గీతాంజలి తర్వాత గిరిజా ఎక్కువ కాలం సినిమా రంగంలో కొనసాగలేదు. తన కెరీర్లో కేవలం ఏడు సినిమాలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆమె లండన్‌లో స్థిరపడి జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. తాజా వీడియోలో ఆమె రూపం పూర్తిగా మారిపోవడంతో ప్రేక్షకులు గుర్తు పట్టలేదు, కానీ కొంత మంది మాత్రం ఒక్క చూపులోనే గీతాంజలి హీరోయిన్ అని గుర్తించారు.