Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!

Gautam Ghattamaneni

Gautam Ghattamaneni

Gautam Ghattamaneni: సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, ఇటీవల సినిమాలపై తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. మొన్నటికి మొన్న నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రివ్యూ, రేటింగ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన గౌతమ్.. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘రామాయణ’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు ఆయన ఏకంగా 4.5 రేటింగ్ ఇవ్వడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ దృశ్య కావ్యంపై గౌతమ్ ప్రశంసల వర్షం కురిపించారు. “నిజాయతీగా చెబుతున్నా.. ఈ సినిమా నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నటీనటుల పర్ఫార్మెన్స్ అన్నీ ఒకదానికొకటి పోటీపడ్డాయి. అక్కడక్కడా సినిమా కాస్త సాగదీసినట్లు అనిపించినప్పటికీ, ఆ నిడివి పెద్ద మైనస్‌గా అనిపించలేదు” అని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, “ఇది ప్రతి ఒక్కరూ థియేటర్లలో తప్పక చూడాల్సిన సినిమా. భారతీయ సినిమా సత్తా, మన సాంకేతిక నైపుణ్యం ఏంటో ప్రపంచ స్థాయికి చాటిచెప్పే అత్యుత్తమ దృశ్యరూపం ఇది” అంటూ రాసుకొచ్చారు. సాధారణంగా స్టార్ హీరోల వారసులు సోషల్ మీడియాలో సినిమా రివ్యూల జోలికి వెళ్లరు. కానీ గౌతమ్ మాత్రం చాలా నిర్మొహమాటంగా, ఎలాంటి భేషజాలు లేకుండా కంటెంట్‌ను విశ్లేషిస్తూ రేటింగ్స్ ఇస్తుండటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గౌతమ్ ఇచ్చిన ఈ 4.5 రేటింగ్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.