టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). నిన్న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో ఒక ఊహించని, షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాత రాజ్ నిడిమోరు, యాంకర్ శ్రీముఖి, చిత్రబృందం సమక్షంలో ‘మా ఇంటి బంగారం’ఈ ఈవెంట్ ఘనంగా జరింగింది. ఇందులో భాగంగా వేదికపై చిత్ర యూనిట్ అంతా ప్రసంగిస్తున్న సమయంలో.. ఒక అభిమాని సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని హఠాత్తుగా స్టేజ్‌పైకి వచ్చి సమంతకు ప్రపోజ్ చేయడం అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒక డైహార్డ్ ఫ్యాన్ అకస్మాత్తుగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి స్టేజ్‌పైకి దూసుకొచ్చాడు. అతడు నేరుగా సమంత వైపు వెళ్తుండటంతో యాంకర్ శ్రీముఖి, దర్శకురాలు నందినీ రెడ్డి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ అభిమాని నేరుగా సమంత ముందుకు వెళ్లి, మోకాళ్లపై కూర్చొని, తన చేతిలో దాచుకున్న పువ్వులను చూపిస్తూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ హఠాత్ పరిణామానికి సమంత కూడా కాసేపు నిర్ఘాంతపోయారు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు.. భద్రతా సిబ్బంది ఆ అభిమానిని పక్కకు లాగేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో సదరు అభిమాని సమంతతో ఒకే ఒక్క సెల్ఫీ కావాలని గట్టిగా కోరాడు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా సమంత ఎంతో ఓపికగా, హుందాగా స్పందించారు. భద్రతా సిబ్బందిని ఆపి, ఆ అభిమానిని దగ్గరకు పిలిచి చిరునవ్వుతో సెల్ఫీకి ఫోజులిచ్చారు. ఆ తర్వాత అతనికి ధన్యవాదాలు చెప్పి స్టేజ్ పైనుంచి పంపించివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది
