‘ద రాక్’గా ఒకప్పుడు డ్వైనే జాన్సన్ కేవలం రెజ్లర్ గా ఫేమస్! ఇప్పుడు? ఆయన నటుడు, నిర్మాత కూడా! హాలీవుడ్ లో యాక్షన్ థ్రిల్లర్స్ మొదలు కామెడీ ఎంటర్టైనర్స్ దాకా జాన్సన్ చేయని జానర్ లేదు! అయితే, ఇంత కాలం తనకు లోటుగా ఉన్న ఒక అంశంపై కూడా ఇప్పుడు ద రాక్ దృష్టి పెట్టాడు. అదే క్రిస్మస్ మూవీ!
మన హీరోలు, దర్శకనిర్మాతలకి సంక్రాంతి సినిమా లాగా హాలీవుడ్ వారికి క్రిస్మస్ సీజన్ చాలా స్పెషల్! కెరీర్ లో ఒక్కసారన్నా పండగ వేళ బాక్సాఫీస్ వద్దకొచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాలనుకుంటారు. ఇప్పుడు అదే పనిలో జాన్సన్ అలియాస్ ‘ద రాక్’! ‘రెడ్ వన్’ పేరుతో ఆయన నటించి, నిర్మించిన సినిమా క్రిస్మస్ కి రాబోతోంది. అయితే, దీనిపై ఇంకా ఫుల్ డిటైల్స్ బయటకు రాలేదు. మన రాక్ మాత్రం, ‘’రెడ్ వన్ హాలీడే యూనివర్స్’’ అంటూ ప్రత్యేకంగా ఓ వాఖ్యం వాడాడు! దీనిపై అనేక ఊహాగానాలు సాగుతున్నాయి!
‘రెడ్ వన్’ మూవీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఓ నూతన విశ్వాన్ని ఆవిష్కరిస్తుందని కొందరు అంటున్నారు. అందుకే, డ్వైనే జాన్సన్ ‘హాలీడే యూనివర్స్’ అనే పదాలు వాడంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా ‘రెడ్ వన్’ మీద ఊహాగానాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. జాన్సన్ తన తాజా చిత్రం కోసం అమేజాన్ తోనూ చేతులు కలిపాడు. అంటే… ‘రెడ్ వన్’ ముందు ముందు ఓ మార్కెట్ బ్రాండ్ గా కూడా మారొచ్చునట! ఆ పేరుతో ఉత్పత్తి అయ్యే వివిధ రకాల వస్తువుల్ని అమేజాన్ మార్కెట్ లో ప్రవేశపెట్టి వినియోగదారులకి డోర్ డెలివరీ చేస్తుందని ప్రచారం సాగుతోంది! చూడాలి మరి, జాన్సన్… ద రాక్… ‘రెడ్ వన్’ దుమారం క్రిస్మస్ వేళ ఎలా ఉండబోతోందో!