Dulquer Salmaan: సౌత్ ఇండియన్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా తమను తాము ‘నెపో కిడ్స్’ అని పిలుచుకుంటూనే, ఎలాంటి సినీ నేపథ్యం లేని కొత్త హీరోయిన్ సాత్వికను పరిచయం చేయడం పట్ల ఆయన చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లితో పాటు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దుల్కర్ సల్మాన్ వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సినిమా ఇండస్ట్రీలో మేమిద్దరం (దుల్కర్, శృతి హాసన్) నెపో కిడ్స్‌గా అడుగుపెట్టాం. అలాంటి మేమిద్దరం కలిసి, సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేని, పూర్తిగా కొత్త టాలెంట్ అయిన సాత్వికను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. ఇది ఏదో మంచి కర్మలా నాకు అనిపిస్తోంది. అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేస్తూ, పెద్ద కలలతో ఉన్న సాత్వికను మేము ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా గుర్తించాం. నటులు కావాలనుకునే యువతకు ఇదొక గొప్ప స్ఫూర్తి” అని దుల్కర్ కొనియాడారు. ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర సినిమాను టాప్ గేర్‌లోకి తీసుకెళ్తుందని, ఆమెతో కలిసి నటించడం గొప్ప అనుభూతి అని దుల్కర్ తెలిపారు.
నిజానికి ఈ కథ విన్నప్పుడు ఇది హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అని, తన పాత్రకు అంత ప్రాధాన్యత ఉంటుందో లేదో అని ముందు సందేహించినట్లు దుల్కర్ నిజాయితీగా చెప్పారు. అయితే తాను ‘లక్కీ భాస్కర్’ షూటింగ్ పూర్తి చేసే వరకు ఈ చిత్ర బృందం మరొకరిని తీసుకోకుండా తన కోసమే ఎదురుచూసిందని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా ఎక్కడ చేజారిపోతుందోనన్న భయంతో తాను వెంటనే ఓకే చెప్పానని, తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన చిత్రాల్లో ఇదొకటని అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్‌తో తనకున్న రెండు మధుర జ్ఞాపకాలను దుల్కర్ పంచుకున్నారు. తన మొదటి సినిమా షూటింగ్ కేరళలోని కాలికట్ సమీపంలో ఒక మారుమూల గ్రామంలో జరిగినప్పుడు, అక్కడ ఒక చిన్న ఇంట్లో ఉన్న దేవుడి బీరువాపై పేపర్ కటింగ్‌లో అల్లు అర్జున్ ఫోటో చూశానని తెలిపారు. అప్పట్లోనే కేరళ గ్రామాలకు ఆయన క్రేజ్ పాకిందన్నారు.
అలాగే లాక్డౌన్ సమయంలో తమ కుటుంబమంతా ‘అల వైకుంఠపురములో’ సినిమా చూశామని, అప్పుడు మూడేళ్ల వయసున్న తన కూతురు ‘అల్లు అర్జున్’ అని పిలుస్తూ.. ‘నాన్న నీకు అల్లు అర్జున్ తెలుసా? ఒక ఫోటో దిగాలి’ అని జీవితంలో మొదటిసారి ఒక కోరిక కోరిందని దుల్కర్ చెప్పగానే ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. నిర్మాత అల్లు అరవింద్ ప్రతి సినిమాను సొంత బిడ్డలా చూసుకుంటారని, తండ్రికి తగ్గ తనయుడు అల్లు అర్జున్ అని ప్రశంసించారు. ఇక డైరెక్టర్ పవన్ సాధినేని నైట్ షూటింగ్స్‌లో కూడా సన్‌గ్లాసెస్ పెట్టుకుని తిరుగుతుంటే ఏంటి ఈయన యాటిట్యూడ్ అనుకున్నానని, తర్వాత అవి పవర్ గ్లాసెస్ అని, ఆయన తన కళ్లద్దాలు హైదరాబాద్‌లో మర్చిపోయి వచ్చారని తెలిసి నవ్వుకున్నామని సరదా విషయాన్ని పంచుకున్నారు. ఆడపిల్లల కలల నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రతి కుటుంబం తప్పక చూడాలని దుల్కర్ కోరారు.

