NTV Telugu Site icon

CM Relief Fund: సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ.. డిప్యూటీ సీఎంకు చెక్‌ అందజేసిన హైపర్ ఆది

Hyper Aadi

Hyper Aadi

CM Relief Fund: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు చెక్కులు అందించారు పలువురు దాతలు.. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ తరఫున రూ.67,29,398 చెక్కును పవన్‌ కల్యాణ్‌కి అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు యువ షణ్ముఖ, అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ ఫరూక్ జాన్, ప్రధాన కార్యదర్శి బి.శంకరరావు దొర తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస విభాగం అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణమ్ మార్కండేయ బాబు పాల్గొన్నారు. మరోవైపు.. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి శ్రీమతి వెంకట లక్ష్మి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. అదే విధంగా నియోజకవర్గం నుంచి అందిన రూ.4.82 లక్షల విరాళం సహాయ నిధికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను పవన్ కల్యాణ్ కి అందచేశారు.

Read Also: Govinda Namalu: మనసులోని కోరికలు తీరాలంటే గోవిందనామాలు వినండి

మరోవైపు టాలీవుడ్‌ యువ నటుడు ఆది అలియాస్‌ హైపర్‌ ఆది తన వంతు సాయాన్ని అందించారు.. గ్రామ పంచాయతీలకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అందించారు. వరదల పీడిత గ్రామమైన ఎ.కె.మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) పంచాయతీకి రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆది.. మరో రూ.2 లక్షలు తన స్వగ్రామం పల్లామల్లి గ్రామ పంచాయతీ (ప్రకాశం జిల్లా)కి ఇచ్చారు. ఆ రెండు వేర్వేరు చెక్కులను పవన్‌ కల్యాణ్‌కి అందజేశారు.. ఈ సందర్భంగా హైపర్‌ ఆది మాట్లాడుతూ.. వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రూ.6 కోట్లు విరాళం ఇచ్చి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి నా వంతుగా రూ.3 లక్షలు అందించాను అని వెల్లడించారు హైపర్‌ ఆది..