ఓటీటీ శకం మొదలయ్యాక ప్రేక్షకులకి క్రియేటివ్ కంటెంట్ చూసే స్వేచ్ఛ చాలా ఎక్కువైంది. పైగా రోజురోజుకి డిజిటల్ ప్రాజెక్ట్స్ భారీగా మారుతున్నాయి. వెబ్ సిరీస్ అంటే ఏదో సాదాసీదాగా తీసేయటం లేదు బడా నిర్మాతలు. కోట్లలో ఖర్చు చేసి సినిమాలతో సమానంగా క్వాలిటీ సాధిస్తున్నారు. అటువంటి గ్రాండ్ రాయల్ షోనే ‘ద ఎంపైర్’!
బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వాణీ సమర్పిస్తోన్న ‘ద ఎంపైర్’కి దర్శకురాలు మితాక్షరా కుమార్. ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు డీనో మోరియా. లుక్స్ పరంగా ఎప్పుడూ అమ్మాయిల హాట్ ఫేవరెట్ అయిన డీనో ‘ద ఎంపైర్’లో మరింత గంభీరంగా, గొప్పగా కనిపించబోతున్నాడు. ఆయన తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫస్ట్ లుక్ అదరగొట్టేసింది. కొంత వరకూ ‘పద్మావత్’ మూవీలోని రణవీర్ సింగ్ ‘అల్లావుద్దీన్ ఖిల్జీ’ లుక్ ని జ్ఞాపకం చేసినా కూడా డీనో చాలా మందిని ఆశ్చర్యపరచగలిగాడు. ‘డేంజరస్ గా, ఫెరోషియస్ గా ఉన్నప్పటికీ మీరు చూస్తూనే ఉంటారు’ అని తన క్యారెక్టర్ గురించి డీనో ఇన్ స్టాగ్రామ్ లో వ్యాఖ్యానించాడు!
డీనో ‘ద ఎంపైర్’ ఫస్ట్ లుక్ కి నెటిజన్స్ నుంచే కాక బాలీవుడ్ సెలబ్స్ నుంచీ కూడా పెద్ద ఎత్తున అప్లాజ్ వచ్చింది. రణవీర్ సింగ్ తో పాటూ అలీ ఫైజల్, శిబానీ దందేకర్, మృణాల్ ఠాకూర్ కామెంట్ చేశారు! దాంతో ప్రస్తుతం డీనో మోరియా ‘ద ఎంపైర్’ రాయల్ స్కేరీ లుక్ నెట్ లో వైరల్ అవుతోంది…
