Dharmasthala Niyojakavargam : డ్రగ్స్ మాఫియాపై టాలీవుడ్ గురి ?

Dharmasthala Niyojakavargams

Dharmasthala Niyojakavargams

ప్రస్తుతం దేశవ్యాప్తంగా డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారుతున్న తరుణంలో, ఇదే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని టాలీవుడ్‌లో ఓ పవర్‌ఫుల్ మూవీ రాబోతోంది. సాయికుమార్, సుమన్, వితికా షేరు, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’. మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని వి.వి.వినాయక్ ధీమా వ్యక్తం చేశారు. “చంద్రబోస్ నాకు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దర్శకుడు జ్ఞాన ప్రభ అద్భుతమైన సినిమా చేశాడని ఆయన అన్నారు. కథ బాగా నచ్చి, ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సంతోషంగా పాటలన్నీ రాసినట్లు చంద్రబోస్ చెప్పారు. ఆయన అంత గట్టిగా చెప్పిన తర్వాత నాక్కూడా ఇది గొప్ప సినిమా అవుతుందని నమ్మకం కలిగింది” అని వినాయక్ తెలిపారు. తన తొలి సినిమా ‘ఆది’కి మొదటి పాట చంద్రబోస్ రాశారని, అలాగే జ్ఞాన ప్రభ మొదటి సినిమాకు కూడా ఆయనే లిరిక్స్ అందించడం విశేషమని వినాయక్ గుర్తుచేసుకున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. “ఒక రచయితగా నాకు చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిన చిత్రమిది. రామ్‌చరణ్ ‘రంగస్థలం’ తర్వాత అంతటి అర్థవంతమైన సాహిత్యాన్ని అందించే అద్భుతమైన సందర్భాలను దర్శకుడు ఈ సినిమాలో క్రియేట్ చేశారు. సమాజంలో ఓ మహా మానవుడికి, అల్ప మానవుడికి మధ్య జరిగే సంఘర్షణే ఈ కథాంశం” అని ఆయన వివరించారు. యదార్థ ఘటనల ఆధారంగా ఫిక్షనల్ కథతో, కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు జ్ఞాన ప్రభ తెలిపారు. ప్రముఖ విలన్ సత్యప్రకాష్ కుమారుడు నటరాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. సెప్టెంబర్ 4న ఈ ‘ధర్మస్థల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.