Alias Rukmini : వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌ను నమ్మి రిస్క్ చేశారా?

Alias Rukmini Heroine

Alias Rukmini Heroine

వరుస అపజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరో నితిన్, ఈసారి ఎలాగైనా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన్ను హీరోగా ఎంచుకోవడంపై ‘అలియాస్ రుక్మిణి’ నిర్మాత దీప్తి గంటా తాజాగా ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. నితిన్ గత చిత్రాల ఫలితాలను చూసి తాను ఎలాంటి లెక్కలు వేసుకోలేదని, కేవలం కథకు ఆయనే సరిపోతారనే నమ్మకంతోనే ముందుకు వెళ్లామని ఆమె స్పష్టం చేశారు.

నిజానికి ఈ ప్రాజెక్ట్‌లోకి నితిన్ రావడం వెనుక నేచురల్ స్టార్ నాని ఉన్నారని దీప్తి అసలు సీక్రెట్ వెల్లడించారు. “కథ విన్న తర్వాత మేము వేరే హీరోలను సంప్రదిస్తున్న సమయంలో, ఒకసారి నితిన్‌ను కూడా దృష్టిలో పెట్టుకోండి అని నాని సలహా ఇచ్చారు. నాని, నితిన్ ఒకరినొకరు ‘బాబు’ అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. నాని ఫోన్ చేసి చెప్పగానే, నితిన్ కథ విని అదే రోజు సినిమా చేస్తున్నట్లు మాట ఇచ్చేశారు. ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా నితిన్ చేసిన మొదటి సినిమా ఇదే” అని దీప్తి గంటా పేర్కొన్నారు.

నాని సమర్పణలో, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మించిన ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించారు. నితిన్ సరసన ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయి కుమార్, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం, జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డిసెంబర్ 4న థియేటర్లలోకి వస్తున్న ‘అలియాస్ రుక్మిణి’, నితిన్‌కు కోరుకున్న విజయాన్ని అందిస్తుందేమో చూడాలి!