జేమ్స్ బాండ్ అంటేనే ఎప్పుడూ క్రేజ్! ఇక ఈసారి కొత్త జేమ్స్ బాండ్ కూడా! మరి ఆసక్తి ఎలా ఉంటుంది చెప్పండి? హాలీవుడ్ సినిమాలు చూసే వారంతా ఇప్పుడు డేనియల్ క్రెయిగ్ తరువాత బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ 007 ఎవరంటూ మాట్లాడుకుంటున్నారు! అయితే, రోజుకొక పేరు తెర మీదకు వస్తుండటంతో సొషల్ మీడియా హీటెక్కిపోతోంది…
డేనియల్ క్రెయిగ్ చివరి సారి జేమ్స్ బాండ్ గా కనిపించబోతోన్న చిత్రం ‘నో టైం టూ డై’. కరోనా వల్ల బాండ్ కూడా థియేటర్స్ లేక ఇంత కాలంగా క్వారంటైన్ లోనే ఉండిపోయాడు. ఇక ఇప్పుడు బాండ్ సిరీస్ లో 25వ చిత్రం ‘నో టైం టూ డై’ సెప్టెంబర్ 30న బ్రిటీష్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అక్టోర్ 8న అమెరికన్స్ డేనియల్ క్రెయిగ్ ను బాండ్ గా చివరిసారి చూస్తారు! ఇక ఆ తరువాత 26వ బాండ్ మూవీలో కొత్త సీక్రెట్ ఏజెంట్ బరిలోకి దిగుతాడు…
డేనియల్ క్రెయిగ్ బాండ్ గా రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పటికీ నుంచీ చాలా పేర్లు వినిపించాయి. అయితే, టామ్ హార్డీ మాత్రం గట్టిగా సత్తా చాటాడు. ఆయన పేరు ఆన్ లైన్ లో మార్మోగింది. చివరకు, ప్రచారం పెరిగి పెరిగి అందరూ అతడ్నే నెక్ట్స్ బాండ్ అనేసుకున్నారు. కానీ, ఇంతలో ఒకటి వెంట ఒకటి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. టామ్ హార్డీ తరువాత కొన్నాళ్లు జేమ్స్ నార్టన్ అన్నారు చాలా మంది. ఒక దశలో టామ్ హిడల్ స్టన్ లాంటి అందగాడి పేరు కూడా వినిపించింది. మొత్తానికి కన్ ఫ్యూజన్ తప్ప క్లారిటీ లేకుండా పోయింది…
కొత్త జేమ్స్ బాండ్ పేరు తెలిసేది ప్రస్తుత బాండ్ చిత్రం ‘నో టైం టూ డై’ విడుదల తరువాతే. ఆ సినిమా థియేట్రికల్ రన్ తరువాత నింపాదిగా ఫిల్మ్ మేకర్స్ న్యూ 007 ను అనౌన్స్ చేస్తారు. అయితే, అంతలోపే ఇప్పుడు మరో బలమైన పేరు తెర మీదకొచ్చింది. జీన్ పేజ్ కాబోయే సీక్రెట్ ఏజెంట్ అంటూ కొందరు గుట్టు విప్పుతున్నారు. వాళ్లకు ఎలా తెలుసు అంటారా? ఎవరి వద్దా అఫీషియల్ ఇన్ ఫర్మేషన్ లేదు! అయితే, ఇంతకు ముందు జీన్ పేజ్ చేసిన పాత్రలు చాలా వరకూ సాహస వీరుడి పాత్రలే. ప్రస్తుతం ఆయన నెట్ ఫ్లిక్స్ కోసం కూడా ‘ద గ్రే మ్యాన్’ సినిమాలో గూఢచారిగా నటిస్తున్నాడు. అందుకే, ఆయనకి నెక్ట్స్ బాండ్ గా అవతరించే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ప్రచారం ఊపందుకుంది. చూడాలి మరి, రాబోయే 26వ బాండ్ మూవీలో కాబోయే 007 ఎవరో!