ఇండియాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మరోసారి థియేటర్లు మూతపడ్డాయి. వేరే దారి లేక సల్మాన్ ఖాన్ స్టారర్ ‘రాధే’ లాంటి బిగ్ బడ్జెట్, క్రేజీ మూవీస్ కూడా ఓటీటీ బాటపడుతున్నాయి. మరి అమెరికాలో హాలీవుడ్ పరిస్థితేంటి? ఎగ్జాక్ట్ లీ, ఆపోజిట్…
యూఎస్ లోనే కాదు, నార్త్ అమెరికా మొత్తం కూడా క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనా కేసులు తగ్గటంతో పాటూ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుండటంతో జనం అధిక సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. సినిమా రంగానికి అంతకంటే కావాల్సింది ఏముంది?
2020లో కరోనా మహమ్మారి విలయం మొదలయ్యాక ఇంత కాలానికి ఓ హాలీవుడ్ మూవీ ప్రిమియర్ ఘనంగా జరిగింది. ఎమ్మా స్టోన్ టైటిల్ రోల్ చేసిన ‘క్రుయెల్లా’ సినిమా ప్రి రిలీజ్ వేడుక రీసెంట్ గా జరిగింది. నిజానికి ఎప్పుడూ డిస్నీ సంస్థ నిర్వహించే ప్రీమియర్స్ కి ఉన్నంత హంగామా ఈసారి లేదు. తక్కువ మంది అతిథులతో మీడియా లేకుండానే ‘క్రుయెల్లా’ ప్రీమియర్ షో వేశారు. అయినా కూడా కరోనా దుమారం మొదలయ్యాక ఈ మాత్రం వేడుక జరగటం, రెడ్ కార్పెట్ హడావిడి కూడా ఎక్కడా కనిపించలేదు. ‘క్రుయెల్లా’ ప్రీమియర్ అమెరికాలో చోటు చేసుకుంటోన్న పోస్ట్ లాక్ డౌన్ పరిస్థితులకి అద్దం పడుతుంది.
ఇప్పటికే యూఎస్, నార్త్ అమెరికాలోని 65 శాతం థియేటర్లు పునః ప్రారంభం అయ్యాయి. దాంతో మే 28న జనం ముందుకు భారీ ఎత్తున రాబోతోంది ‘క్రుయెల్లా’. చూడాలి మరి, ఇక మీదట హాలీవుడ్ కరోనాను కాస్తంత మరిచిపోయి ఎలా మళ్లీ పుంజుకుంటుందో!