‘కలర్స్’ స్వాతి వివాహానంతరం సినిమాలు చేస్తుందా? చేయదా? అనే విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహాగానాలు చేశారు. అయితే 2018లో పైలట్ వికాశ్ వాసు ను వివాహం చేసుకున్న స్వాతి మాత్రం కమ్ బ్యాక్ గురించి ఎప్పుడూ నోరు తెరిచి చెప్పిందే లేదు. నటన అంటే మక్కువ ఉన్న స్వాతి తప్పకుండా రీ-ఎంట్రీ ఇస్తుందని కొందరన్నారు. మరికొందరు సినిమాల్లో నటించకపోయినా… వెబ్ సీరిస్ చేసే ఛాన్స్ ఉందన్నారు. కానీ పెళ్ళి తర్వాత కూడా నటిగానే కొనసాగడానికి స్వాతి సిద్దమైపోయింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘పంచతంత్రం’ మూవీలో స్వాతి కీలక పాత్ర పోషిస్తోంది.
Read Also: శివానీ రాజశేఖర్ కు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ టీమ్ బర్త్ డే విషెస్
ఈ సినిమాలో బ్రహ్మానందం, సముతిర ఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేశ్ అగస్త్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటీనటుల జాబితాలో స్వాతి రెడ్డి అనే పేరున్నా… నటి స్వాతి పేరు చివర పదంతో పాపులర్ కాదు కాబట్టి… చాలామంది ఇంకెవరో అనుకున్నారు. అయితే తాజాగా ‘పంచతంత్రం’ సెట్ లో పాల్గొన్న స్వాతి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో… స్వాతి కమ్ బ్యాక్ మూవీ విషయంలో అందరికీ, ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ వచ్చింది. నూతన దర్శకుడు హర్ష పులిపాక తో సృజన్ ఎరబోలు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2017లో స్వాతి చివరగా ‘లండన్ బాబులు’ మూవీలో నటించింది. ఆ తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. మరి నటిగా తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి స్వాతి ఎలాంటి కసరత్తు చేసిందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే!