మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం నుండి మొదటి పాట వచ్చేసింది. ఇప్పటికే అద్భుతమైన స్పందనతో రికార్డు వ్యూస్ సాధించిన ప్రోమో తర్వాత, ‘మీసాల పిల్ల’ పూర్తి లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట సంగీత ప్రియులను, మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ‘మీసాల పిల్ల’ పాట పవర్‌ఫుల్ ఎలక్ట్రానిక్ బీట్స్, పంచ్ బాస్ లైన్స్‌తో మాస్, మెలోడీ కలగలిపిన ఓ అద్భుతమైన ట్రాక్‌గా నిలిచింది. భాస్కరభట్ల అందించిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ సినిమా కోసం ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ గొంతు కలపడం ఈ పాటలో అతిపెద్ద హైలైట్. ఆయన నోస్టాల్జిక్ వాయిస్ పాటకు కొత్త వైబ్ ఇచ్చింది. శ్వేతా మోహన్ గాత్రం మరింత మాధుర్యాన్ని జోడించింది.
Also Read:Maithili Thakur: బీజేపీలోకి మైథిలి ఠాకూర్, బీహార్ ఎన్నికల్లో పోటీ.. ఈమెకు ఇంత క్రేజ్ ఎలా.?
ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి తన ట్రేడ్‌మార్క్ గ్రేస్, స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు. చార్మింగ్, స్టైలిష్ సూట్‌లో ఆయన కనిపించిన తీరు అభిమానులకు కనుల పండుగ చేసింది. విజయ్ పోలాకి కొరియోగ్రఫీలో చిరంజీవి వింటేజ్ డ్యాన్స్ స్టైల్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. అందమైన చీరలో నయనతార మెరిసిపోగా, చిరంజీవి-నయనతార మధ్య కెమిస్ట్రీ మ్యాజికల్‌గా ఉంది. కలర్‌ఫుల్ సెట్స్ మధ్య చిత్రీకరించిన ఈ పాట విజువల్ ట్రీట్‌గా నిలుస్తోంది. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సుష్మిత కొణిదెల భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. మొత్తంమీద సంగీతం, సాహిత్యం, కొరియోగ్రఫీ, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ అన్నీ కలిసి ‘మీసాల పిల్ల’ పాటను ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది.