Chiranjeevi : ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి మనసులో మాట..

Chiranjeevi Review Aakasamlo Oka Tara

Chiranjeevi Review Aakasamlo Oka Tara

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చూసి మనస్ఫూర్తిగా స్పందించారంటే, ఆ కథలో ఏదో బలమైన ఎమోషన్ ఉందనే అర్థం. తాజాగా దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి, సినిమాపై తన మనసులోని మాటను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రం తన హృదయాన్ని ఎంతో కదిలించిందని చెబుతూ, ముఖ్యంగా సెకండాఫ్ చూస్తున్నంతసేపూ తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, తల్లిదండ్రులందరూ తప్పకుండా తమ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడాలని, ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని మెగాస్టార్ ఆకాంక్షించారు.

ఇంతటి స్ఫూర్తిదాయకమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేనిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. తెరపై దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తమ సహజమైన యాక్టింగ్‌తో పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. వీరితో పాటు సినిమాలో కీలక పాత్రలు పోషించిన శ్రుతి హాసన్, రుహానీ శర్మ సహా మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని మెగాస్టార్ కితాబిచ్చారు.

సాంకేతిక విభాగాల పనితీరుపైనా చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, సుజిత్ సారంగ్ అద్భుతమైన ఛాయాగ్రహణం కథలోని భావోద్వేగాలను మరింతగా మనసుకు హత్తుకునేలా చేశాయని ప్రశంసించారు. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాణ సంస్థలు స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియాతో పాటు చిత్ర బృందం మొత్తానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మెగాస్టార్ నుంచి ఇంతటి ఆత్మీయమైన ప్రశంస దక్కడంతో ‘ఆకాశంలో ఒక తార’ టీమ్ ఆనందంలో మునిగిపోయింది.