“సాహో” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్. అయితే ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో ఇక సుజీత్ కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా అవకాశం పట్టేశాడు. మలయాళ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ కు దర్శకత్వం వహించడానికి సుజీత్ ను మొదటగా ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో సుజీత్ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాడు. కానీ మెగాస్టార్ కోసం సుజీత్ మరో తమిళ రీమేక్ ను సిద్ధం చేస్తున్నాడనేది తాజా సమాచారం. లాక్డౌన్ సమయంలో చిరంజీవి ఇతర భాషల నుండి కొన్ని చిత్రాలను ఎంపిక చేసుకున్నారట. అందులో కొన్నిటిని రీమేక్ చేయడానికి ఆసక్తిని కనబరిచారట. అజిత్ నటించిన “యెన్నై అరింధాల్” చిత్రం అందులో ఒకటి. తమిళంలో గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా… అజిత్, త్రిష, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ‘ఎంతవాడు గాని’ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేశారట మేకర్స్. సుజీత్ కు ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పని అప్పజెప్పారట మెగాస్టార్. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులతో మొదటి వెర్షన్‌ను వివరించే పనిలో పడ్డాడట సుజీత్.