తమిళ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అనేక హిట్ సినిమాలకు తన గాత్రాన్ని అందించి, తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలువురు ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి మంచి పేరు సంపాదించింది. ఒకవైపు ప్రొఫెషన్‌లో బిజీగా ఉండి, మరోవైపు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై బహిరంగంగా స్పందిస్తూ ఉంటుంది. అయితే, ఈ ధైర్యమైన వైఖరి కొన్ని సార్లు ఆమెను వివాదాల్లోకి లాగుతుంది. ఇందులో భాగంగా తాజాగా చిన్మయి మరోసారి వార్తల్లో నిలిచింది.
Also Read : Venkatesh Maha : ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరెక్టర్‌తో సత్యదేవ్ న్యూ ప్రాజెక్ట్
తాజాగా యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో, చిన్మయి “అల్టిమేట్ దివా సింగర్” అవార్డు అందుకుంది. అవార్డు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చిన్మయి, మొదట ప్రశ్నలకు ఓర్పుతో సమాధానాలు ఇచ్చింది. అయితే, ఒక విలేకరి వేసిన ప్రశ్న ఆమెను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దానికి ప్రతిస్పందిస్తూ.. ‘నన్ను ఏడు సంవత్సరాలు ఇండస్ట్రీకి బ్యాన్ చేశారు. కనీసం డబ్బింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పట్లో నేను ఎవరినీ ప్రశ్నించ లేక పోయాను. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారా?’అంటూ ఘాటుగా స్పందించింది. అంతేకాదు.. ‘మీ పని మీరు చూసుకోండి’ అనేలా వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్మయి గతంలో కూడా పలు సందర్భాల్లో వివాదాలకు గురైన విషయం తెలిసిందే. ఈసారి ఈ ఘటన ఎంతవరకు వెళ్తుందో చూడాలి.