బాలీవుడ్ హాస్యనటి సుగంథ మిశ్రా, హాస్యనటుడు సాకేతి భోంస్లే వివాహం ఏప్రిల్ చివరి వారంలో పంజాబ్ లో జరిగింది. ఈ హాస్య జంట తమ పెళ్ళిన ధూమ్ ధామ్ గా చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తమ అభిమానులకు ఈ పెళ్ళి సందర్భంగా జరిగిన హంగామా తెలియాలని… ఆ వేడుక ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవేమో వైరల్ అయిపోయాయి. ఇంకేముందే కరోనా సమయంలో నియమాలకు నీళ్ళు వదలి వీళ్ళు పెళ్ళి చేసుకున్నారంటూ కొందరు కన్నెర్ర చేశారు. అంతేనా… పెళ్ళికూతురుపై కేసు కూడా పెట్టారు. పెళ్ళికొడుకు కోసం పంజాబ్ లోని ఫగ్వారా రిసార్ట్ లో ఏర్పాటు చేసిన విడిదిలో భారీ స్థాయిలో బంధుమిత్రులు జమ అయ్యారని, ఇది కరోనా నిబంధనలు అతిక్రమించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో స్థానిక పోలీసులు ఐపీసి సెక్షన్ 188 కింద సుగంథపై కేసు బుక్ చేశారు. అయితే… పాపం కొత్త జంటను ఎందుకు డిస్ట్రబ్ చేయడమని భావించారేమో తెలియదు కానీ… అరెస్టులైతే ఇంతవరకూ చేయలేదట!