మామూలోడు పక్కడితో పోటీ పడతాడు! మొనగాడు తనతో తానే పోటీ పడుతుంటాడు! ఈ విషయం మళ్లీ నిరూపించారు ‘ఆ ఏడుగురు’! బీటీఎస్ సరికొత్త మ్యూజికల్ డ్యాన్స్ నంబర్ ‘బట్టర్’ యూట్యూబ్ ని అల్లాడిస్తోంది. గతంలో తాము ‘డైనమైట్’తో నెలకొల్పిన ప్రపంచ రికార్డుని తామే ‘బట్టర్’తో బద్ధలుకొట్టారు బీటీఎస్ బాయ్స్!
బీటీఎస్ టీమ్ యూట్యూబ్ లో విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ 24 గంటల్లోనే 108.2 మిలియన్ వ్యూస్ సంసాదించింది! ఇది ఇప్పటి వరకూ ఉన్న ప్రపంచ రికార్డ్ కంటే దాదాపు 7 మిలియన్లు ఎక్కువ. అయితే, గతంలోనూ యూట్యూబ్ లో వరల్డ్ నంబర్ వన్ గా బీటీఎస్ బాయ్సే ఉన్నారు. పోయిన సంవత్సరం విడుదలైన వారి తొలి ఇంగ్లీష్ పాట ‘డైనమైట్’ ఇంత కాలం 101.1 మిలియన్ వ్యూస్ తో ఫస్ట్ డే రికార్డ్ హోల్డ్ చేసింది. ఇప్పుడు ‘బట్టర్’ దాన్ని బద్ధలు కొట్టింది.
‘బిగ్గెస్ట్ 24 అవర్ డెబ్యూ ఆన్ యూట్యూబ్’ … ఈ ఒక్కటే కాదు… బీటీఎస్ మరో మూడు ప్రపంచ రికార్డులు కూడా డిజిటల్ వేదికలపై స్వంతం చేసుకుంది. ‘బట్టర్’ సాంగ్ విడుదలైన ఒక్క రోజులోనే పెను సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్ లో ‘బిగ్గెస్ట్ మ్యూజిక్ వీడియో ప్రిమియర్’ రికార్డు కూడా ఇప్పుడు బీటీఎస్ పేరు మీదే నమోదైంది. ఇక ఆడియో స్ట్రీమింగ్ వెబ్ సైట్ ‘స్పొటిఫై’లో 11.042 మిలియన్ స్ట్రీమ్స్ తో ‘బిగ్గెస్ట్ డెబ్యూ’ రికార్డ్ ‘బట్టర్’ స్వంతం అయింది. 20.9 మిలియన్ స్ట్రీమ్స్ తో ‘లార్జెస్ట్ సింగిల్ డే’ కౌంట్ కూడా బీటీఎస్ మ్యూజికల్ నంబర్ కే వశమైంది!
విడుదలైన తొలి రోజే యూట్యూబ్, స్పొటిఫైలో దుమారం రేపిన ‘బట్టర్’ బీటీఎస్ కి గ్రామీ తెచ్చి పెడుతుందో లేదో చూడాలి! బిల్ బోర్డ్ లో నంబర్ వన్ గా నిలిచిన ‘డైనమైట్’ ఇంతకు ముందు వారికి గ్రామీ నామినేషన్ సంపాదించింది. ఈసారి బీటీఎస్ బాయ్స్ గ్రామీ ఎగరేసుకుపోతారని వారి ఫ్యాన్స్ అంటున్నారు!