మామూలోడు పక్కోడితో పోటి పడతాడు. మొనగాడు తనతో తానే పొటి పడతాడు. కొరియన్ క్రేజీ సింగర్స్ బ్యాండ్ అయిన బీటీఎస్ వ్యవహారం అలాగే ఉంది. మొత్తం ఏడుగురు గాయకులు కలసి మార్మోగించే బీటీఎస్ పాటలు ఇప్పటికే వరల్డ్ ఫేమస్. అయితే, తాజాగా వారు విడుదల చేసిన ‘బటర్’ సాంగ్ గతంలోని ప్రతీ రికార్డుని వెదికి వెదికి బద్ధలు కొడుతోంది. లెటెస్ట్ గా ‘యూఎస్ బిల్ బోర్డ్ హాట్ 100 చార్ట్’లో అత్యధిక కాలం నంబర్ వన్ గా ఉండి చరిత్ర సృష్టించింది. ‘బట్టర్’ సాంగ్ ఈ శతాబ్దంలోనే అత్యధిక కాలం నంబర్ వన్ గా కొనసాగుతోన్న మ్యూజికల్ నంబర్!
బీటీఎస్ ఎంట్రీ తరువాత ఇప్పటికి ఎనిమిదేళ్లు గడిచాయి. తమ ఎయిత్ యానివర్సరీ సందర్భంగా అనేక వారాల నుంచీ కొరియన్ స్టార్ సింగర్స్ ‘పెస్టా 2021’ పేరుతో సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. ఆ సంబరాలకు వీడ్కోలు పలుకుతూ రెండు రోజుల ఆన్ లైన్ కన్సర్ట్ నిర్వహించారు. జూన్ 13-14 తేదీల్లో వారు ఎయిత్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ముగించగా అదే సమయంలో బిల్ బోర్డ్ టాప్ 100 లిస్టులో మూడో వారం కూడా ‘బట్టర్’ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో బీటీఎస్ బ్యాండ్ నుంచే విడుదలైన ‘డైనమైట్’ రెండు వారాల పాటూ నంబర్ వన్ గా కొనసాగింది. తమ రికార్డ్ ను తామే బద్ధలు కొట్టారు బీటీఎస్ బాయ్స్!
మే నెల 21వ తేదీన విడుదలైంది ‘బట్టర్’ సాంగ్. అప్పట్నుంచీ మొదలైన ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. యూఎస్ లో బీటీఎస్ న్యూ మ్యూజికల్ నంబర్ హంగామా కనీవిని ఎరుగని రీతిలో ఉంది!