కష్టాలన్నిట్లో అవమానం దారుణమైనది! పైగా అది లోలోన దాగుండి దహించేస్తుంటే మరింత నరకప్రాయంగా ఉంటుంది. అందుకే, ఆ హాలీవుడ్ నటుడు తనని ఇంత కాలం తీవ్ర మానసిక వేదనకి గురి చేసిన అంతర్మథనాన్ని ఇంతటితో అంతం చేద్దామనుకున్నాడు. 14 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న రహస్యం బయటపెట్టేశాడు. ప్రపంచం అవమానిస్తుందేమో అన్న భయం పక్కన పెట్టి తన ముందు తానైతే తల దించుకోకుండా ఉండాలని డిసైడ్ అయ్యాడు! అతనే బిల్లీ పోర్టర్…
బిల్లీ పోర్టర్ ఓ అమెరికన్ నటుడు. ‘పోజ్’ అనే టీవీ సీరిస్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఎమ్మీ అవార్డ్ కూడా పొందాడు. 51 పోర్టర్ కి ఎమ్మీ సాధించి పెట్టిన క్యారెక్టర్ ప్రే టెల్. ఆ పాత్రకి కథలో హెచ్ ఐవీ పాజిటివ్ ఉంటుంది. అంటే, ఎయిడ్స్ గురైన ఓ వ్యక్తి సంఘర్షణతో కూడుకున్న ఎమోషనల్ రోల్ అన్నమాట. ట్విస్ట్ ఏంటంటే, ఈ సినియర్ టాలెంటెడ్ నటుడు ఇప్పుడు తన తెర మీద పాత్ర నిజ జీవితంలోనూ నిజమేనని ప్రకటించాడు! బిల్లీ పోర్టర్ గత 14ఏళ్లుగా హెచ్ ఐవీ పేషంట్…
ఏళ్ల తరబడి తనలో దాచుకున్న నిజాన్ని బయట పెట్టిన పోర్టర్ సత్యం ఎప్పుడూ ఉపశమనం కలిగిస్తుంది అన్నాడు. ప్రపంచానికి నిజం చెప్పటం ద్వారా తనకు శాంతి లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. అలాగే, అవమాన భారం లోలోన దహించేస్తుందని పోర్టర్ అన్నాడు. దాన్ని ఎంతగా గుండెల్లో దాచుకుంటే అంతగా జీవితం నాశనం చేస్తుందని చెప్పాడు. అందుకే, ఆయన ఇప్పుడు తన హెచ్ ఐవి సీక్రెట్ రివీల్ చేశాడట.
హెచ్ ఐవిని మందులు, ఇతర మార్గాల్లో జయించగలిగిన బిల్లీ పోర్టర్ ఎమ్మీ లాంటి టాప్ అవార్డ్ గెలుచుకున్న తొలి గే బ్లాక్ మ్యాన్!