భారతదేశంలో వివిధ భాషల్లో సాగుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు విశేష వీక్షకాదరణ ఉంది. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో సుదీప్, తమిళంలో కమల్ హాసన్ నిర్వహిస్తున్న ఈ రియాలిటీ షోను తెలుగులో మొన్న వరుసగా నాగార్జున రెండో సారి నిర్వహించారు. అలానే మలయాళంలో వరుసగా మూడోసారి మోహన్ లాల్ ఈ షోను నిర్వహించబోతున్నారు. ఇందు కోసం చెన్నయ్ శివార్లలోని ఈవీపీ గార్డెన్స్ లో సెట్ వేశారు. కానీ ఈసారి మలయాళ బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి వచ్చిన వారిలో ఏకంగా ఆరుమందికి కరోనా పాజిటివ్ వచ్చిందట. దాంతో వారందరిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారట. దాంతో ఈ షోను కొంతకాలం పాటు వాయిదా వేయాలని నిర్ణయానికి నిర్వాహకులు వచ్చారని తెలుస్తోంది. అలానే ఇప్పటికే కన్నడ బిగ్ బాస్ సీజన్ 8ను కూడా మధ్యలోనే నిలిపేశారు. కరోనా తీవ్రతను తట్టుకోవడం కష్టంగా మారడంతో 71 రోజుల తర్వాత దానిని ఆపేయాల్సి వచ్చింది. మరి తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 కూడా ఇదే కారణాలతో వాయిదా పడుతోందని అంటున్నారు.