తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వ కాలంలో భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంపై విచారణ కోసం ఆయన సోమవారం ఉదయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారుల ముందు హాజరయ్యారు. భరత్ భూషణ్ ఫోన్ టాపింగ్ వ్యవహారం గత ఎన్నికల సమయంలో జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఆయన ఫోన్ సంభాషణలు టాప్ చేయబడినట్లు సమాచారం. సిట్అధికారులు ఈ విషయంపై లోతైన విచారణ జరుపుతూ, భరత్ భూషణ్ నుంచి సమాచారం సేకరించారు. ఈ ట్యాపింగ్ వెనుక ఉన్న కారణాలు గురించి తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Also Read:Phanindra Narsetti : కాశీ ‘కబేళా’లో బ్రాహ్మణుడితో రేప్ అటెంప్ట్.. మా తప్పేం లేదంటున్న డైరెక్టర్!
భరత్ భూషణ్ 2024 జూలై 28న తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అధ్యక్ష పదవీ కాలం ముగియడంతో జరిగిన ఎన్నికల్లో, భరత్ భూషణ్ ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధుపై 29 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 48 మంది సభ్యుల్లో 46 మంది ఓటు వేశారు. భరత్ భూషణ్ విజయం డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌కు గుర్తింపును తీసుకొచ్చింది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఉండేవారు. 2023 ఎన్నికల సమయంలో భరత్ భూషణ్ ఫోన్ టాపింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడం గమనార్హం. ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. భరత్ భూషణ్ వంటి ప్రముఖ వ్యక్తి ఫోన్ టాపింగ్‌కు గురవడం, అది కూడా ఎన్నికల సమయంలో జరగడం సినీ పరిశ్రమలోని ఇతర సభ్యులను కలవరపెడుతోంది. ఈ వ్యవహారం వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.
