బాహుబలి పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి సృష్టించిన ఈ సిరీస్‌ను ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు. రెండు పార్ట్‌లను కలిపి ఒకే సినిమాలో ఎడిట్ చేసి రిలీజ్ చేయడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పాన్ ఇండియా ప్రేక్షకులు మళ్లీ ఆ భారీ చిత్రాన్ని పెద్ద స్క్రీన్ మీద చూడటానికి థియేటర్లకు తరలివస్తున్నారు. కానీ ఈ రీ-రిలీజ్లో ఒక అంశం మాత్రం కొంతమంది ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. అది కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పాత్ర గురించి. అసలు సినిమాల్లో చిన్నదైన కానీ ఇంపాక్ట్ఫుల్ రోల్ చేసిన సుదీప్ సీన్లు ఈ కొత్త ఎపిక్‌లో పూర్తిగా తొలగించారని తెలుస్తోంది. రెండు సినిమాలను కలిపి ఒకే ఫ్లోలో చూపించాలనే ఉద్దేశ్యంతో కొన్ని సబ్‌ప్లాట్స్, సైడ్ క్యారెక్టర్స్ కట్ చేసినట్లు మేకర్స్ చెబుతున్నా, అభిమానులు ఆ వివరణతో సంతృప్తి చెందడం లేదు.
Also Read : OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘మలయాళ ఇండస్ట్రీ హిట్’ సినిమా
సుదీప్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మా హీరోని ఎందుకు తీసేశారు?”, “బాహుబలి కథలో భాగమైన సుదీప్ సీన్లే సినిమాకు ఒక ప్రత్యేకత, వాటిని తొలగించడం అన్యాయం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు “ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో సుదీప్ చేసిన పాత్రను గుర్తుంచుకోవడం మేకర్స్ బాధ్యత” అని వాదిస్తున్నారు. ఇక మరోవైపు, కొంతమంది నెటిజన్లు మాత్రం “సినిమా రీ-ఎడిట్ కావడంతో కాటెంట్ తగ్గించాల్సి వచ్చింది, అందుకే ఆ సీన్లను తీసేసి ఉండొచ్చు” అని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ‘బాహుబలి ది ఎపిక్’ రీ-రిలీజ్ చుట్టూ మళ్లీ హైప్ పెరిగినా, సుదీప్ అభిమానుల అసంతృప్తి మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.