Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ

Baabaablacksheep

Baabaablacksheep

అక్టోబర్ బరిలో బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న వేళ, ఒక చిన్న సినిమా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతోంది. విభిన్నమైన న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ కాన్సెప్ట్‌‌తో తెరకెక్కిన ‘బా బా బ్లాక్ షీప్’ అక్టోబర్ 9న థియేటర్లలో సందడి చేయనుంది. పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి.. ఈ సినిమాను థియేటర్లలో చూసే ప్రేక్షకులకు ఏకంగా ఉచితంగా ‘మేఘాలయ ట్రిప్’ తీసుకెళ్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజువల్స్ పట్ల మేకర్స్ అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 28 రోజుల పాటు పూర్తిగా మేఘాలయలోని ఎవరూ చూడని, అత్యద్భుతమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. ఇలా ఒక తెలుగు సినిమాను ఆసాంతం మేఘాలయలో చిత్రీకరించడం బహుశా ఇదే తొలిసారి. విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే ఉన్న అద్భుతమైన ప్రకృతిని చూపిస్తూ స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే అక్కడ షూట్ చేసినట్లు నిర్మాత వెల్లడించారు. మేఘాలయ సీఎం కాన్రాడ్ కె.సంగ్మా, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తమకు ఇచ్చిన పూర్తి మద్దతు వల్లే ఇది సాధ్యమైందని ఆయన గుర్తుచేసుకున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఒక ప్రత్యేక కాంటెస్ట్ ద్వారా ప్రేక్షకులను మేఘాలయకు పంపనున్నారు.

హీరో, హీరోయిన్, విలన్ అనే రొటీన్ ఫార్మాట్‌కు భిన్నంగా ప్రతి పాత్రకూ ఎంతో ప్రాధాన్యత ఉండేలా ఈ కథను అల్లుకున్నారు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు ఉపేంద్ర లిమాయె పూర్తిస్థాయి పాత్రలో నటించడం విశేషం. ట్రైలర్ లాంచ్ వేదికపై ఆయన మాట్లాడుతూ.. తన సొంత వాయిస్‌తో తెలుగు ఇండస్ట్రీకి తనను పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను పాత్ర కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, దర్శకుడు గుణి చెప్పిన పాయింట్ నచ్చడంతోనే ఈ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు స్పష్టం చేశారు. అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, నేపాల్ నటి సమృద్ధి ఆర్యాళ్, మాల్వీ మల్హోత్రా, టిను ఆనంద్, జార్జ్ మరియన్ తదితరులు తమ సహజమైన నటనతో అలరించారు.