ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల కారణంగా.. ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను తప్పిస్తూ ఎన్‌సీబీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో విచారణాధికారిగా సంజయ్ సింగ్‌ను నియమించారు. వాంఖడేను ఢిల్లీలో ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇకపై ఆర్యన్‌ఖాన్ కేసు సహా మొత్తం ఆరు డ్రగ్ కేసులను సంజయ్ సింగ్ నేతృత్వంలో ఎన్‌సీబీ సెంట్రల్ యూనిట్ దర్యాప్తు చేయనుంది.సమీర్ వాంఖడే చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డ తర్వాత.. కేసు నుంచి అతన్ని తప్పించేందుకు 25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వాంఖడే ఆరోపణలు ఉన్నాయ్. అటు డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వాంఖడేను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. వాంఖడే కోట్లకు పడగలెత్తారని.. ఆయన నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం సంపాదించాడని ఆరోపించారు. వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ ఎన్‌సీబీ.. వాంఖడేతో పాటు మరికొంత మందిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండగానే ఆయన్ని తప్పించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆర్యన్ ఖాన్‌తో సహా ఆరు డ్రగ్స్ కేసులను విచారించేందుకు.. ఇవాళ ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లనుంది ఎన్సీబీ ప్రత్యేక బృందం.