Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్

Pawan Kalyan

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా కుడి భుజం సమస్యతో బాధపడుతున్న పవన్, ఇటీవలే అక్కడ విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ అనంతరం వేగంగా కోలుకుంటున్న పవన్ కళ్యాణ్, కొద్దిసేపటి క్రితమే వైద్యుల అనుమతితో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసానికి బయలుదేరారు. ప్రస్తుతానికి ఆయన హైదరాబాద్‌లో ఉంటూ విశ్రాంతి తీసుకోనున్నారు. శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు వైద్యులు పలు కీలక సూచనలు చేశారు.

ఆపరేషన్ జరిగిన కుడి భుజం మళ్లీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుందని వైద్య బృందం వెల్లడించింది. అలాగే, మరో మూడు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాతే ఫిజియోథెరపీ ప్రక్రియను ప్రారంభించాలని వైద్యులు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ కావడంతో ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.