Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు

Anupama Parameshwaran

Anupama Parameshwaran

ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన పాస్ట్ రిలేషన్, వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు తాను అనుభవించిన టాక్సిక్ రిలేషన్, ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఒక పార్టనర్ పక్కన ఉన్నప్పుడు ఎవరైనా ప్రశాంతంగా, సురక్షితంగా భావిస్తారు. కానీ తాను మాత్రం ఆ బంధంలో ఉన్నంత కాలం ప్రతి నిమిషం భయంతో, ఆందోళనతో గడిపానని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. “ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఎంతో భయంగా ఉండేది. నేను మామూలుగా చేసుకునే పనులు కూడా నేను సరిగ్గా చేసుకోలేకపోయేదాన్ని. ఏదైనా మాట్లాడే ముందు ‘నేను ఇది మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఎలా స్పందిస్తారో?’ అని మనసులోనే వందసార్లు ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రతిరోజూ ఒక అనిశ్చితి, భయం నన్ను వెంటాడేవి. కానీ ఈ పరిస్థితిలోకి మనం ఎలా వెళ్తామో మనకే తెలియదు. చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా మనల్ని ఆ పరిస్థితిలోకి తీసుకెళ్తారు” అని ఆమె చెప్పారు.
తమ ఇరు కుటుంబాలు కలవడం, ఇరువైపులా ఒకరి ఇళ్లల్లో ఒకరం సమయం గడపడం వల్ల ‘ఈ వ్యక్తితోనే జీవితం’ అని బలంగా నమ్మానని, కానీ ఆ తర్వాతే అసలు స్వరూపం బయటపడిందని ఆమె వివరించారు. కంట్రోల్ మరింత పెరిగిపోయిందని ఆమె ఆరోపించారు. “నా కెరీర్‌లో అత్యంత విజయవంతమైన ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్లకు కూడా నేను ఎందుకు వెళ్లలేదో నాకు మాత్రమే తెలుసు. ఎన్నో మంచి ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. నా ప్రతి విషయంలోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకునేవారు. నా కుటుంబానికి, స్నేహితులకు నన్ను దూరం చేశారు. బయటకి వచ్చి ఎవరైనా ‘ఎలా ఉన్నావు?’ అని ప్రేమగా అడిగితే ఎక్కడ ఏడ్చేస్తానో అని భయపడేదాన్ని” అని అనుపమ భావోద్వేగానికి గురయ్యారు. ఎదుటి వ్యక్తి వల్ల తనకు ఎంత హాని జరుగుతున్నా, తనను ఎలా అడ్డుకుంటున్నా… ఒకానొక దశలో తనే సొంత కుటుంబం నుంచి ఆ వ్యక్తిని కాపాడుతూ వచ్చానని ఆమె చెప్పారు. స్నేహితులకు కూడా క్రమంగా దూరమైపోయా అని పేర్కొన్నారు. అనుపమ చేసిన ఈ సంచలన ఆరోపణలు, టాక్సిక్ రిలేషన్‌షిప్ అనుభవాలు ప్రస్తుతం నెట్టింట హాల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ వ్యవహారంపై అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి క్లారిటీ లేదా వివరణ వస్తుందో అని సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.