Site icon NTV Telugu

Cinema Theatre Inspections: ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో కొనసాగుతున్న తనిఖీలు

Theatres

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లతో కలిపి 1300కు పైగా థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి 32 అంశాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, విశాఖపట్నం వంటి జిల్లాల్లో కొనసాగుతున్నాయి.

కాకినాడలో లోపాలపై నివేదిక
కాకినాడ జిల్లాలోని పిఠాపురం, తుని, ఏలేశ్వరం, పెద్దాపురం ప్రాంతాల్లో ఒక్క రోజులోనే 9 థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో థియేటర్ ఫిట్‌నెస్, ఫైర్ సేఫ్టీ, బ్లాక్ టికెట్ వ్యవహారాలు, పారిశుద్ధ్యం వంటి అంశాలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించారు. కొన్ని థియేటర్లలో క్యాంటీన్‌లలో ఆహార పదార్థాలు, నీటి బాటిళ్లు అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ లోపాలపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించిన అధికారుల బృందం, రెగ్యులర్ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ సూచనల మేరకు, కాకినాడలోని చాణక్య, చంద్రగుప్త థియేటర్లలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో), మండల రెవెన్యూ అధికారులు (ఎంఆర్వో), పోలీసులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.

కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తనిఖీలు
కృష్ణా జిల్లా గుడివాడలో రెవెన్యూ అధికారులు థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆర్డీవో బాలసుబ్రమణ్యం, తహసీల్దార్ రామకోటేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో క్యాంటీన్‌లలో ధరల చార్టులు, టికెట్ రేట్ల ప్రదర్శన తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. అదే విధంగా, నెల్లూరు జిల్లా కోవూరులోని మైధిలి, శ్రీనివాస థియేటర్లలో ఆర్డీవో అనూష తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కనీస వసతులు, నీటి బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలను పరిశీలించారు.

విశాఖపట్నంలో 32 అంశాలపై పరిశీలన
విశాఖపట్నం నగరంలోని సినిమా థియేటర్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పారిశుద్ధ్యం, ఫైర్ సేఫ్టీ, ఆహార పదార్థాల ధరలతో పాటు 32 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పలు థియేటర్లలో లోపాలను గుర్తించిన అధికారులు, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.

Exit mobile version