తెలుగు బుల్లితెరపై తిరుగులేని గ్లామర్ క్వీన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే స్టార్ యాంకర్ ఉదయభాను వ్యక్తిగత జీవితం ఒకానొక దశలో తీవ్ర దుమారం రేపింది. ఆమె పెళ్లి, కుటుంబ విభేదాలు ఏకంగా న్యూస్ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్‌గా మారి హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. ఆ సమయంలో అసలేం జరిగింది? ఆమె పర్సనల్ లైఫ్ మీడియాకెక్కి అంతలా రచ్చ కావడానికి వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అనే అంశంపై ఉదయభాను తాజాగా ‘ఎన్టీవీ పాడ్‌కాస్ట్’ (The Podcast Show with NTV) వేదికగా తొలిసారి ఓపెన్‌గా స్పందించి సంచలన నిజాలు పంచుకున్నారు.
“మీ పర్సనల్ లైఫ్ ఛానల్స్ వరకు ఎందుకు వచ్చింది?” అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఉదయభాను ఏమాత్రం దాపరికం లేకుండా సమాధానమిచ్చారు. “ప్రతి అమ్మాయి జీవితంలోనూ ఒక కఠినమైన ఫేజ్ ఉంటుంది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కేవలం 23 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో మా ఇంట్లో సంపాదించే ఏకైక వ్యక్తిని నేనొక్కదాన్నే. దాంతో కుటుంబంలో నాపై ఆధారపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నా సంపాదన చూసి ఇంట్లో కొందరు పనులు చేయడం కూడా పూర్తిగా మానేశారు” అంటూ ఉదయభాను షాకింగ్ విషయాలను వెల్లడించారు.
కుటుంబంలో అందరూ ఆమె సంపాదనపైనే ఆధారపడటంతో ఆమె తల్లిపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడిందని ఉదయభాను వివరించారు. “అందరినీ చూసుకోవాలి, అందరినీ సంతృప్తిపరచాలనే తాపత్రయంలో మా అమ్మపై విపరీతమైన భారం పడింది. ఏ తల్లి అయినా తన కూతురు బాగుండాలనే కోరుకుంటుంది, మా అమ్మ కూడా అదే కోరుకుంది. కానీ ఆ విపరీతమైన ఆర్థిక డిపెండెన్సీ, బాధ్యతల నడుమ కుటుంబంలో తీవ్రమైన మనస్పర్థలు, చిన్నపాటి డిస్టర్బెన్స్ తలెత్తాయి. అవే పెద్దవై ఆనాడు టీవీ ఛానళ్ల వరకు వెళ్లి రచ్చగా మారాయి” అని ఆనాటి చేదు రోజులను గుర్తుచేసుకున్నారు. అయితే ఆ తుఫాను లాంటి కష్టకాలం గడిచిపోయిందని, అవన్నీ ఇప్పుడు గతం మాత్రమేనని ఉదయభాను స్పష్టం చేశారు. ఆ విభేదాలన్నీ సమసిపోయి, ప్రస్తుతం తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని ఆమె చెప్పారు. బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ కోట్లాది మందిని అలరించిన ఉదయభాను వెనుక, ఆమె సంపాదనపై ఆధారపడ్డ కుటుంబం వల్ల ఎంతటి పెను సంక్షోభం దాగి ఉందో తెలిసి ఇప్పుడు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

