విరాజ్ అశ్విన్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. కరోనా సెకండ్ వేవ్ సమయంలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కానున్న మొదటి చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మే 7న ప్రసారం కానుంది. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనసూయ గర్భవతిగా నటించారు. అయితే బాధ్యత తెలియని యువకుడి పాత్ర పోషించిన విరాజ్ అశ్విన్ తో లిఫ్ట్‌లో చిక్కుకుంటుంది అనసూయ. ఆ తరువాత ఏం జరిగిందనే సినిమా ప్రధానాంశం. ఈ చిత్రానికి గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించగా… మాగుంట శరత్ చంద్రరెడ్డి, తారక్ నాథ్ బొమ్మి రెడ్డి నిర్మిస్తున్నారు. ‘థ్యాంక్ యు బ్రదర్’ చిత్రంలో అనసూయ, విరాజ్ అశ్విన్‌లతో పాటు వివా హర్ష, అర్చన అనంత్, కాదంబరి కిరణ్, అనీష్ కురువిల్ల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనసూయ పారితోషికంగా ఎంత తీసుకుందనే విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం కోసం అనసూయ రోజుకు రూ .1.5 లక్షలు వసూలు చేసిందట. 17 రోజుల షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసింది అనసూయ. ఆ విధంగా ‘థాంక్యూ బ్రదర్’ కోసం ఆమె రెమ్యూనరేషన్ గా రూ.25 లక్షలు సంపాదించిందట.