Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!

Anaswara Rajan

Anaswara Rajan

Anaswara Rajan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్లు ఆయన్ను సొంత హీరోలా ‘మల్లు అర్జున్’ అంటూ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మలయాళ భామ అనస్వర రాజన్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ గురించి చెప్పిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా ఏళ్లపాటు అల్లు అర్జున్ ఒక మలయాళీ హీరోనే అని తాను బలంగా నమ్మానని, తీరా అసలు విషయం తెలిశాక షాక్ అయ్యానని ఆమె చెప్పిన ముచ్చట ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీపై తనకున్న అభిమానాన్ని పంచుకుంటూ అనస్వర నవ్వులు పూయించారు. “చిన్నప్పటి నుంచి కేరళలో అల్లు అర్జున్ సినిమాలు చూస్తూనే పెరిగాం. ఆయన డబ్బింగ్ సినిమాలన్నీ ఒక లోకల్ డైరెక్టరే పర్యవేక్షించేవారు, దాంతో ఆ వాయిస్ మాకు బాగా అలవాటైపోయింది. చిన్నతనంలో నాకు అసలు ఆయన ఒక తెలుగు స్టార్ అనే విషయమే తెలియదు. అచ్చమైన మలయాళీ నటుడే అనుకుని పిచ్చిగా అభిమానించేదాన్ని. చాలా కాలం తర్వాత గానీ అసలు విషయం తెలిసి రాలేదు.. ఆయన టాలీవుడ్ టాప్ హీరో అని తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను” అంటూ చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ అంటే తనకు ఎంత పిచ్చో చెబుతూ మరో క్రేజీ సంఘటనను కూడా ఆమె బయటపెట్టారు. గతంలో బన్నీ నటించిన ‘హ్యాపీ’ సినిమా కేరళలో రీ-రిలీజ్ అయినప్పుడు.. తనకు అదే సమయంలో వేరే ఊరికి వెళ్లాల్సిన ఫ్లైట్ ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదట. “ఫ్లైట్ పోతే పోయింది కానీ, థియేటర్‌లో బన్నీ సినిమా చూడాల్సిందేనని మొండిపట్టు పట్టా. ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్‌కి వెళ్లి ప్రతి పాటకూ స్టెప్పులేస్తూ రచ్చ చేశాను” అని తనలోని డైహార్డ్ ఫ్యాన్ గర్ల్‌ను బయటపెట్టారు. ఒక హీరోయిన్ అయి ఉండి కూడా అల్లు అర్జున్ గురించి ఇంత ఓపెన్‌గా, ముద్దుగా మాట్లాడటంతో బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.