కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. సినిమాలు, సీరియల్స్, రియాల్టి షోలలో పాల్గొనటానికి ఇటు నటీనటులు, అటు జనం భయపడుతున్నారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కూడా వాయిదా పడింది. అయితే అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో మాత్రం అనుకున్న టైమ్ కి ఆన్ ఎయిర్ కాబోతోంది. సోనీ టెలివిజన్ నిర్వహిస్తున్న ఈ షోలో సామాన్యలు సైతం తమ ప్రతిభతో లక్షలు గెలుచుకుంటున్నారు. నిజానికి ఈ షోలో పాల్గొనటం పలువురికి డ్రీమ్. అందుకే కోవిడ్ ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకుని షో కంటిన్యూ చేస్తామంటున్నారు. నిజానికి గతేడాది కేబీసీ షూట్ లోనే అమితాబ్ కి కరోనా వచ్చింది. కోలుకున్న తరువాత జాగ్రత్తలు తీసుకుని షో కంప్లీట్ చేశారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఆడియన్స్ లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటించి షో నిర్వహించారు. గత సీజన్ సక్సెస్ కావటంతో ఈ ఏడాది కూడా కొత్త సీజన్ ఆరంభిస్తున్నారు. అమితాబ్ సైతం ఈ వయసులోనూ 13 వ సీజన్ తో షూటింగ్ కి రెడీ అంటున్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కట్టుదిట్టమైన జాగ్రత్తలతో 13వ సీజన్ ఆరంభించబోతున్నారు. అమితాబ్ హోస్ట్ చేస్తున్న ఈ షో రిజిస్ట్రేషన్స్ మే 10 న ఆరంభం అవుతున్నాయి. ప్రోమో కూడా రిలీజ్ చేశారు. మరి కరోనా సెకండ్ వేవ్ లో కేబీసీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూద్దాం.