Ambas Revenge : ఒక్క మనిషి కూడా నటించని తొలి ఏఐ(AI) తెలుగు సినిమా.. మహాభారత నేపథ్యంతో ‘అంబాస్ రివెంజ్’ టీజర్ రిలీజ్

Ambas Revenge

Ambas Revenge

మనుషులు ఎవరూ నటించకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో మాత్రమే రూపొందిన సరికొత్త విజువల్ వండర్ “అంబాస్ రివెంజ్”. భారతీయ ఇతిహాసం మహాభారతంలోని అంబ పాత్ర స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో మీడియా సమక్షంలో చిత్ర బృందం అంగరంగ వైభవంగా విడుదల చేసింది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైవర్ధన్ మేడి దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతంలో భీష్ముడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన అంబ, మరో జన్మలో శిఖండిగా మారి భీష్మునిపై ఎలా పగ తీర్చుకుందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా అంబ పేరుతో ఉన్నప్పటికీ, కథ మొత్తం శిఖండి కోణం నుంచి సాగుతుందని దర్శకుడు జైవర్ధన్ మేడి వెల్లడించారు. కేవలం ప్రధాన పాత్రలను పరిచయం చేయడం కోసమే డైలాగ్స్ లేకుండా ఈ టీజర్‌ను కట్ చేశామని, త్వరలోనే డైలాగ్స్‌తో కూడిన పూర్తి స్థాయి ట్రైలర్‌ను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.

సాధారణంగా ఏఐ టెక్నాలజీతో సినిమా అనగానే ఖర్చు తక్కువ ఉంటుందని భావిస్తారని, కానీ అది నిజం కాదని నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి స్పష్టం చేశారు. ఏఐ రంగంలో ఒక టూల్ వాడేలోపే సాంకేతికత అప్‌డేట్ అయి కొత్త టూల్ వస్తుండటంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని ఆయన తెలిపారు. సోషల్ మీడియా రీల్స్ ద్వారా ప్రేక్షకులకు ఏఐ పట్ల అవగాహన పెరిగిందని, ఈ సినిమా వారికి కచ్చితంగా ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందని ఎడిటర్ హ్యారీ బ్రెయిన్, విజువల్ డైరెక్టర్ సాయి నేత పేర్కొన్నారు. నేటి తరానికి అర్థమయ్యేలా రెండు పాటలతో ఈ చిత్రాన్ని మలిచామని డైలాగ్ రైటర్ కిషోర్ కుమార్ ఏనుగు, సంగీత దర్శకుడు ప్రమోద్ ఎంసి తెలిపారు.