Amala Akkineni: అక్కినేని కుటుంబంలో ఇద్దరు కోడళ్లు అడుగుపెట్టినప్పటి నుంచి తమ ఇంటి వాతావరణమే పూర్తిగా మారిపోయిందని అంటున్నారు నటి అమల అక్కినేని. ఇన్నాళ్లూ ఇంట్లో పురుషులే ఎక్కువగా ఉండేవారని, కానీ ఇప్పుడు నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ, అఖిల్ భార్య జైనబ్ రావ్డ్జీ రాకతో ఇంట్లో మహిళల సందడి మొదలైందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల.. ఇద్దరు కోడళ్లతో తనకున్న అనుబంధం గురించి, ముఖ్యంగా అఖిల్ భార్య జైనబ్ తీసుకునే ప్రత్యేక శ్రద్ధ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అఖిల్ భార్య జైనబ్‌తో తనకు మరింత దగ్గరి అనుబంధం ఉందని అమల మనసు విప్పి చెప్పారు. అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్నప్పుడే తాను ఆమెను కలిశానని, అప్పటి నుంచే తన వ్యక్తిత్వం ఎంతో నచ్చిందని తెలిపారు. జైనబ్ చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఉంటుందని.. తనకు సొంత కూతురిలా అనిపిస్తుందని అమల పేర్కొన్నారు. తనకంటే ఎక్కువగా తన ఆరోగ్యం, అవసరాల గురించి జైనబ్ శ్రద్ధ తీసుకుంటుందని, నాగార్జునను కూడా ఎంతో బాగా చూసుకుంటుందని చెప్పారు. అంతేకాకుండా, జైనబ్ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి తమ ఇంట్లో పండగల వాతావరణమే మారిపోయిందని అమల వెల్లడించారు. గతంలో పండగలను చాలా నిరాడంబరంగా, కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకునేవాళ్లమని.. కానీ జైనబ్ వచ్చాక ప్రతి వేడుకనూ ఎంతో ఘనంగా, కొత్త ఉత్సాహంతో నిర్వహిస్తున్నామని వివరించారు.
మరోవైపు పెద్ద కోడలు శోభిత ధూళిపాళ గురించి కూడా అమల ప్రశంసలు కురిపించారు. శోభిత కెరీర్లో సాధించిన విజయాలను అభినందిస్తూనే.. ఆమె ఎంతో ఆప్యాయంగా ఉంటుందని, కుటుంబంలో అందరితోనూ చాలా సులువుగా కలిసిపోతుందని తెలిపారు. అత్తగా ఉండటం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని, ఇంతకుముందు ఇంట్లో అందరూ మగవాళ్లే ఉండేవారని, ఇప్పుడు తనకు ఇద్దరు కూతుళ్లు వచ్చారని అమల ఆనందంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

