బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అఖండ తెలంగాణ రేట్ల పెంపు జీవో కొద్దిసేపటి క్రితమే జారీ అయింది. టికెట్ రేట్ల పెంపుతో పాటు, ముందు రోజు రాత్రి 8 గంటలకు ఒక షో వేసుకునే పర్మిషన్ కూడా కల్పించారు.
జీవో జారీ చేసిన దాని ప్రకారం, అఖండ ఐదో తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ముందు రోజు అంటే నాల్గవ తేదీ రాత్రి 8 గంటలకు రూ.600 టికెట్ రేటుతో ఒక షో వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇక తర్వాతి రోజు అంటే ఐదో తేదీ నుంచి సింగిల్ స్క్రీన్స్‌కి ఇంక్లూడింగ్ జీఎస్టీ టికెట్‌పై రూ.50 పెంచుకునే అవకాశం కల్పించారు. అదే మల్టీప్లెక్స్‌లకు రూ.100 పెంచుకునే అవకాశం కల్పించారు.
Also Read :Akhanda 2: అందుకే నైజాం బుకింగ్స్ ఆలస్యం.. మరి కాసేపట్లో?
అయితే, ఈ టికెట్ రేట్ల పెంపు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండనుంది. ఐదు నుంచి ఏడవ తేదీ వరకు మాత్రమే ఈ పెంచిన రేట్లకు టికెట్లు అమ్ముకునే అవకాశం కల్పించారు. అలాగే, ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా, ఈ సినిమా టికెట్ రేట్లు పెంచిన తరువాత వచ్చే లాభంలో 20% మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అలాగే సినీ పరిశ్రమకు చెందిన ఇతర వర్కర్లకు ఖర్చు పెట్టేలా సూచనలు చేశారు. అలాగే, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి, లేబర్ కమిషనర్ సూచనలతో ఆ అకౌంట్ మెయింటైన్ చేయాలని సూచించారు.