మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు గట్టిగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం మెగాస్టార్ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ 3 టైటిల్స్ ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం.
ఇటీవల దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం “లూసిఫర్” రీమేక్ కోసం సిద్ధంగా ఉన్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ మూవీకి “గాడ్ ఫాదర్” అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో తమిళ రీమేక్ “వేదాళం” మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు.
Read Also : “భీమ్లా నాయక్” నిర్మాతలతో కొరటాల చర్చలు… చిరు కోసమే !
తాజాగా ఈ సినిమా కోసమే చిత్ర నిర్మాణ సంస్థ ఏకంగా మూడు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించిందట. “వేదాళం” రీమేక్ ను నిర్మిస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్ మెగాస్టార్, మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ రీమేక్ కోసం ఫిలింఛాంబర్లో ఆటో జానీ, అన్నయ్య కోసం, బోలా శంకర్ అనే 3 టైటిల్స్ ను రిజిస్టర్ చేయించిందని సమాచారం. వీటిలో సినిమాకు ఏదో ఒక టైటిల్ ను ఖరారు చేస్తారు. “ఆటో జానీ” అనే టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. మెగాస్టార్ రీఎంట్రీ సమయంలో పూరీ, చిరు కాంబోలో మూవీ ఉంటుందని, దానికోసం “ఆటో జానీ” అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవి వార్తలుగానే నిలిచిపోయాయి. ఇక ఆగస్టు 22న ఈ మెగా ప్రాజెక్టు సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.
ఇక “లూసిఫర్” రీమేక్ “ఆచార్య” చిత్రాలకు సంబంధించిన అప్డేట్ కూడా రేపు రానుంది. మరోవైపు చిరు పుట్టిన రోజు కోసం మెగా ప్లాన్స్ జరుగుతున్నాయి. ఆ ప్రత్యేక రోజున ట్విట్టర్ సెషన్ లో పలువురు సెలబ్రిటీలు సందడి చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సుమ హోస్ట్ గా వ్యవహరిస్తుందని అంటున్నారు.
మొత్తానికి చిరు పుట్టినరోజు నాడు అభిమానులకు మెగా బొనాంజా రాబోతుంది అన్నమాట. ఇక చిరు అభిమానులకు పండగే పండగ.