Ajay Bhupathi: డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ‘RX100’. ఈ చిత్రం అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమా కంటే ముందే ‘RX100’ టైటిల్‌ను దక్కించుకోవడానికి తాను ఎంత కష్టపడ్డానో తాజాగా వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. జూలై 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అజయ్ భూపతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఫస్ట్ సినిమా టైటిల్‌ను ‘Yamaha RX100’ పేరుతో ఫిలిం చాంబర్‌కు పంపామని చెప్పారు. అయితే ప్రముఖ బ్రాండ్ పేరు ఉండటంతో ఫిలిం చాంబర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. గతంలో కొన్ని కంపెనీలు టైటిల్స్ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించడం సాధ్యం కాదని సూచించారని చెప్పారు. అయితే ఆ టైటిల్‌ను వదులుకోవాలనే ఆలోచన తనకు లేదని, అందుకే హైదరాబాద్‌లోని యమహా షోరూమ్‌ల నుంచి ప్రయత్నాలు ప్రారంభించానని అజయ్ భూపతి వెల్లడించారు. అక్కడి నుంచి చెన్నై రీజినల్ కార్యాలయం వరకు వెళ్లినా సరైన స్పందన రాలేదని చెప్పారు. చివరికి జపాన్‌లోని యమహా ప్రధాన కార్యాలయానికి తన సినిమా కథను, టైటిల్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని వివరిస్తూ ప్రత్యేకంగా మెయిల్ పంపినట్లు తెలిపారు. ఆ మెయిల్‌లో ‘RX100’ టైటిల్ కథకు ఎంత ముఖ్యమో వివరించానని, దానికి స్పందించిన యమహా సంస్థ తన అభ్యర్థనను పరిశీలించి ‘RX100’ పేరును సినిమా టైటిల్‌గా ఉపయోగించేందుకు భారతదేశవ్యాప్తంగా రైట్స్ ఇచ్చిందని అజయ్ భూపతి వెల్లడించారు. అయితే ‘Yamaha’ అనే బ్రాండ్ పేరును ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వలేమని, కేవలం ‘RX100’ టైటిల్‌కే అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. జపాన్ నుంచి నేరుగా అనుమతి లేఖ తీసుకెళ్లి ఫిలిం చాంబర్‌కు సమర్పించడంతో అందరూ ఆశ్చర్యపోయారని ఆయన గుర్తుచేసుకున్నారు. చివరికి అదే టైటిల్ సినిమాకు భారీ గుర్తింపును తీసుకువచ్చిందని, ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుందని ఆయన తెలిపారు.

