Adivi Sesh: అడివి శేష్‌ కొత్త సినిమా.. హీరోయిన్ కోసం అన్వేషణ.. డైరెక్టర్ ఎవరంటే?

Adivi Sesh Rahul Ravindran

Adivi Sesh Rahul Ravindran

Adivi Sesh New Movie with Rahul Ravindran: టాలీవుడ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘గూఢచారి 2’ (జి2)లో నటిస్తున్నారు. 2018లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మీ, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం జి2 షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ స్థాయిలో సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

జి2 షూటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఇరువురి మధ్య చర్చలు పూర్తయ్యాయని, శేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎంపికపై చిత్ర బృందం దృష్టి పెట్టిందట. కథానాయిక ఖరారైన తర్వాత ఈ నెలాఖరులోనే నిర్మాణ సంస్థతో పాటు సినిమా గురించి మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సొంతం (2002) చిత్రంలో కనిపించిన అడివి శేష్.. కర్మ (2010)తో నటుడిగా, దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆపై పంజా (2011), బలుపు (2013), రన్ రాజా రన్ (2014), బాహుబలి: ద బిగినింగ్ (2015) చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. క్షణం (2016), గూఢచారి (2018), ఎవరు (2019), మేజర్ (2022), హిట్: ద సెకండ్ కేస్ (2022), డకోయిట్: ఎ లవ్ స్టోరీ (2026) చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఎప్పటికప్పుడు వైవిధ్య కథలను ఎంచుకునే శేష్.. ఈసారి ఏ తరహా కథలో వస్తాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.