(నేడు నటి దివ్యవాణి పుట్టిన రోజు)
అచ్చ తెలుగు కథానాయికలకు టాలీవుడ్ లో అవకాశాలు దక్కవనే అపప్రధను తోసిరాజని నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్యవాణి. గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టి ఆ పైన చెన్నయ్ చేరి సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంది. ‘సర్దార్ కృష్ణమ నాయుడు’లో హీరో కృష్ణ కుమార్తెగా నటించిన దివ్యవాణి… ఆ తర్వాత మరికొన్ని చిత్రాలలో నటించింది. ఆపైన కొద్ది కాలానికే హీరోయిన్ గా ఎదిగింది. ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ చిత్రాలతో యువత మది దోచిన దివ్యవాణి… బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘పెళ్ళిపుస్తకం’తో ఫ్యామిలీ ఆడియెన్స్ కూ చేరువైంది. దివ్యవాణి చారడేసి కళ్ళను, పిడికెడు నడుమును వెండితెరపై బాపు ఆవిష్కరించిన తీరు చూసి పెద్దవాళ్ళు సైతం బాపురే అన్నారు! దాంతో దివ్యవాణికి ‘బాపు బొమ్మ’ అనే బిరుదొచ్చేసింది. అదే బాపు దర్శకత్వంలో ‘పెళ్ళికొడుకు’లోనూ నటించింది. అదే సమయంలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించి, కథానాయికగా చక్కని గుర్తింపు తెచ్చుకుంది.
వివాహానంతరం కొంతకాలం నటనకు దూరమైన దివ్యవాణిని తిరిగి దర్శకుడు బాపునే ‘రాధాగోపాళం’తో తిరిగి సినిమా రంగంలోకి తీసుకొచ్చారు. ఈసారి మాత్రం ఆమె బాపు బొమ్మగా రాలేదు. వినోదాన్ని పండించే లావుపాటి భామగా వచ్చింది. అయినా… తనదైన హావభావాలతో ఈ తరాన్ని ఆకట్టుకుంది. ‘పంచాక్షరి’, ‘వీర’ వంటి చిత్రాలలో ప్రాధాన్యమున్న పాత్రలు చేసింది. ఆ మధ్య వచ్చిన సావిత్రి బయోపిక్ ‘మహానటి’లోనూ నటించింది. అక్కడి నుండి అడపాదడపా పాత్రలు చేస్తూనే ఉంది దివ్యవాణి. ఆ మధ్యలో క్రైస్తవాన్ని స్వీకరించి, ప్రపంచదేశాలు చుట్టొచ్చి అవకాశం ఉన్నచోట ప్రవచనాలూ చెప్పింది. నటన, ఆధ్యాత్మికం తర్వాత తాజాగా రాజకీయాల బాట పట్టింది. చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరి, అధికార ప్రతినిధిగా నియమితురాలైంది. అయితే… ప్రస్తుతం మాత్రం ఆ పార్టీ అంతర్గత రాజకీయాలతో విసిగి వేసారి.. దూరంగా ఉంటోంది. రేపోమాపో దివ్యవాణి వైసీపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి నటన, రాజకీయాలతో జుగల్బందీ చేస్తున్న దివ్యవాణి తన వారసులెవరినైనా సినిమాల్లోకో రాజకీయాల్లోకో తీసుకెళుతుందేమో చూడాలి. ఏదేమైనా తెలుగు సినిమా రంగంలో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన దివ్యవాణి నటిగా, రాజకీయ నేతగా మరింత ఉన్నత స్థితికి చేరాలని కోరుకుందాం