NTV Telugu Site icon

తండ్రి అడుగు జాడల్లో… రావు రమేశ్

తండ్రి అడుగుజాడల్లో తనయులు పయనించడం చిత్రసీమలో పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా నటుల వారసులు నటనవైపే మొగ్గు చూపుతున్నారు. ఆ మాటకొస్తే నిర్మాతలు, దర్శకులు, సాంకేతికనిపుణుల వారసులు కూడా నటనపైనే మోజు పెంచుకుంటున్నారు. ఇక నటవిరాట్ గా జనం మదిలో నిలచిన రావు గోపాలరావు తనయుడు రావు రమేశ్ సైతం నాన్న బాటలో పయనించి, జేజేలు అందుకుంటున్నాడు. వాచకాభినయంలో భళా అనిపించిన రావు గోపాలరావు తనయునిగా రావు రమేశ్ కూడా తనదైన డైలాగ్ యాక్సెంట్ తో జనాన్ని ఇట్టే పట్టేశాడు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో బిజీయెస్ట్ కేరెక్టర్ యాక్టర్ ఎవరంటే రావు రమేశ్ పేరే వినిపిస్తోంది.

రావు రమేశ్ చెన్నైలోనే విద్యనభ్యసించాడు. రమేశ్ కు ఫోటోగ్రఫి అంటే ప్రాణం. అందువల్ల స్టిల్ ఫోటోగ్రఫిలో పనిచేశాడు. తరువాత కె.రాఘవేంద్రరావు తమ్ముడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.ఎస్. ప్రకాశ్ వద్ద కూడా అసిస్టెంట్ గా ఉన్నాడు. బెంగళూరులో ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలోనూ శిక్షణ పొందాడు. అందులో ఎందుకనో అంతగా రాణించలేక పోయాడు. దాంతో నటనలో ప్రయత్నం మొదలెట్టాడు. “పవిత్రబంధం, కలవారి కోడలు” సీరియల్స్ లో నటించాడు రావు రమేశ్. నాలుగున్నర ఏళ్ళలో దాదాపు వెయ్యి ఎపిసోడ్స్ లో నటించిన రావు రమేశ్ కు జనాల్లోనూ మంచి గుర్తింపు లభించింది. బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘సీమసింహం’లో సిమ్రాన్ సోదరునిగా నటించి, వెండితెరపై కనిపించాడు. తరువాత మళ్ళీ సీరియల్స్ లో నటిస్తూనే, సినిమాల్లో అవకాశం వస్తే చాలు నటించేసేవాడు. ‘గమ్యం’లో వామపక్షవాదిగా, ‘కొత్తబంగారులోకం’లో లెక్చరర్ గా, ‘మగధీర’లో అఘోరాగా, ‘లీడర్’లో హీరో మావయ్యగా… ఇలా పలు చిత్రాల్లో గుర్తింపు ఉన్న పాత్రలు పోషించాడు రావు రమేశ్. అతని నటన జనాన్ని ఆకట్టుకుంటున్న సమయంలో అందరిలోనూ ‘ఎవరీ రావు రమేశ్’ అన్న ప్రశ్న మొదలయింది. అప్పటి దాకా తాను ‘రావు గోపాలరావు తనయుణ్ణని’ చెప్పుకోకుండానే సాగాడు రమేశ్. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తరువాతే గర్వంగా తాను రావు గోపాలరావు తనయుణ్ణి అని చెప్పుకున్నారు. అదీ రావు రమేశ్ లోని నిబద్ధత!

తండ్రి అంత మేనిఛాయ లేకపోయినా, రావు రమేశ్ ను చూడగానే రావు గోపాలరావు పోలికలు కనిపిస్తాయి. ఇక కొన్ని చిత్రాలలో అయితే, గతంలో రావు గోపాలరావు పోషించిన పాత్రల గెటప్స్ నే రావు రమేశ్ తోనూ పోషింపచేశారు. ఆ యా పాత్రల్లో రావు రమేశ్ మంచి మార్కులే సంపాదించాడు. ఇప్పటి దాకా తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేస్తూ సాగుతున్నాడు రావు రమేశ్. ఆయన నటించిన “సీటీమార్, నారప్ప, పుష్ప, ఖిలాడీ, మహాసముద్రం” చిత్రాలు జనం ముందుకు రానున్నాయి. మరి ఈ చిత్రాలలో రావు రమేశ్ ఏ తీరున తన విలక్షణమైన అభినయంతో అలరిస్తాడో చూడాలి.